కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి : ఏఐటీయూసీ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నరసింహ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి జిల్లా ఆఫీసులో ఏఐటియుసి జిల్లా విస్తృతం కౌన్సిల్ సమావేశం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది. నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నారని తెలంగాణలోనూ అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని, చట్టం ప్రకారం కనీస వేతనం ఇవ్వాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పిన అమలు చేయకపోవడం సరికాదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను అనుసరించి కార్మిక లోకానికి అన్యాయం చేస్తున్నారన్నారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి నిర్వీర్యం చేశారన్నారు. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరేలా రోజుకు 8 గంటలు ఉన్న పని దినాన్ని 12 గంటలకు పెంచారని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పని దినం అమలు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. కార్మికుల అభివృద్ధి సంక్షేమం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కార్మిక పోరాటాలను ఉదృతం చేయడం ద్వారా మోడీ మెడలు వంచాలన్నారు. ఏఐటీయూసీ లో చెరి కార్మికులు హక్కులు సాధించుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు భరత్, జిల్లా అధ్యక్షులుకే శ్రీరామ్, కార్యదర్శి మోష, ఉపాధ్యక్షుడు శ్రీహరి, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, రమేష్, రవీందర్, శ్యాంసుందర్, రఘు, కృష్ణవేణి, లక్ష్మమ్మ, ఆంజనేయులు, కృష్ణ, వరుణ్, ఎత్తంమహేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి : ఏఐటీయూసీ)