‘కన్నప్ప’ నుంచి ‘చండుడు’ కారెక్టర్ లుక్ పోస్టర్
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్‌ను వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.
తాజాగా ఈ చిత్రంలో నటుడు సంపత్ పోషించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అడివినే భయాభ్రాంతుల్ని చేసే భీకర జాతి.. నల్ల కనుమ నేలలో పుట్టారు.. మొసళ్ల మడుగు నీరు తాగి పెరిగారు.. భిల్ల జాతి అధినేత చండుడు అంటూ భీకరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నటుడు సంపత్ ఈ కారెక్టర్‌లో అందరినీ మెప్పించేలా కనిపిస్తున్నారు. గెటప్ చాలా కొత్తగా కనిపిస్తోంది.
కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భాగమైన సంగతి తెలిసిందే. “కన్నప్ప” సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచనున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. (Story : ‘కన్నప్ప’ నుంచి ‘చండుడు’ కారెక్టర్ లుక్ పోస్టర్)