యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో
పాలకులు విఫలం: కుతుబ్
న్యూస్తెలుగు/వనపర్తి : యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ విమర్శించారు. శనివారం వనపర్తి ఆఫీస్ లో జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు రూ. 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఆశ చూపి మోసం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిందని, 8 నెలలు కావస్తున్న లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో వేగం పెంచాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేరుశనగ, పత్తి వివిధ రకాల పంటలు పండుతాయని వ్యవసాయ పంటల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. పలుగురాయి, సున్నపురాయి, నాపరాయి, వెదురు పలు రకాల ఖనిజాలు దొరుకుతాయని అందుకు అనుగుణంగా పరిశ్రమలు పెట్టాలన్నారు. వనపర్తి లోని అనేక వనరులు ఉన్నాయని పరిశీలించాలన్నారు. స్వయం ఉపాధి కింద పరిశ్రమలు పెట్టుకుని నిరుద్యోగులకు ప్రభుత్వ గ్యారంటీతో రూ. 25 లక్షల వరకు బ్యాంకు లోన్లను ఇవ్వాలన్నారు. అంతవరకు రూ. 5000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు రమేష్, మహేష్,శివ,తదితరులు పాల్గొన్నారు. (Story : యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో పాలకులు విఫలం: కుతుబ్)

