విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తు
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గిరిజనులు బాగా చదువుకోవాలని పిలుపు
ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం
న్యూస్‌తెలుగు/విజయనగరం : విద్య ద్వారా ఉన్నత భవిష్యత్తు లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చదువు తమ జీవన విధానాన్ని మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. వివిధ గిరిజన కళాశాలలు, పాఠశాలల విద్యార్ధులు సంప్రదాయ గిరిజన నృత్యాలు, ఆదివాసీ కళలను ప్రదర్శించి హోరెత్తించారు. హుషారైన గీతాలతో నృత్యప్రదర్శన చేశారు. ముందుగా అడవితల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. గిరిజనులంతా బాగా చదువుకొని వృద్దిలోకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. సహజవనరుల సంరక్షణకు గిరిజన తెగలు ఎంతగానో పాటుపడుతున్నాయని పేర్కొన్నారు. ఐటిడిఏ ద్వారా ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. అయినప్పటికీ విద్య, వైద్యం గిరిజనులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. డికెపర్తి గిరిజన గ్రామానికి ఫీడర్ అంబులెన్సులద్వారా వైద్యాన్ని అందిస్తామన్నారు. ప్రతీ గిరిజనుడు కనీసం డిగ్రీవరకైనా చదువుకోవాలని కోరారు. ఐటిడిఏ సహకారంతో చిన్నచిన్న పరిశ్రమల స్థాపనకు గిరిజనులకు అవకాశం ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయనగరంలో గిరిజనులకోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. డికె పర్తికి రహదారి నిర్మాణానికి, తాటిపూడి రిజర్వాయర్‌లో బోటు షికారు వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఏ గిరిజన గ్రామంలోనైనా పాఠశాల ఏర్పాటుకు సహకారం అందిస్తామని మంత్రి ప్రకటించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటి పరిరక్షణకోసం ప్రతీఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి కృషి జరుగుతున్నప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజనులు ఏ సమస్యమీద వచ్చినా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనాన్ని వీలైనంత త్వరగా స్వాధీనం చేస్తామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కాలనీలు, గ్రామాలన్నిటికీ సురక్షిత త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని గిరిజనులు ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్ కోరారు.
విజయనగరం ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న విద్య, రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవడం ద్వారా గిరిజనులు కొంతమేర అభివృద్ది చెందారని, ఇంకా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు ద్వారా గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై, తమ వాణి వినిపిస్తున్నారని చెప్పారు. గిరిజనుల కోసం ప్రభుత్వాలు సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేసి విద్యనందిస్తున్నాయని అన్నారు. గిరిజన సంక్షేమం కోసం మాన్సాస్ సంస్థ కూడా తనవంతు కృషి చేస్తోందని చెప్పారు. గిరిజనులకోసం మాన్సాస్ సంస్థ చాలా ఏళ్ల క్రితమే సుమారు 3వేల ఎకరాలను కేటాయించిందని, ఈ స్థలంలో గిరిజనులకోసం కెజి నుంచి పిజి వరకు విద్యనందించే గొప్ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని అదితి కోరారు.
జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, జిల్లా బిసి సంక్షేమాధికారి కిడారి సందీప్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి బి.రామానందంతోపాటు, వివిధ గిరిజన సంఘాల నాయకులు తుమ్మి అప్పలరాజుదొర, డివిజి శ్యామ్, ఎ.వెంకటరమణ, బి.లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను వివరించి, వాటిని పరిష్కరించాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ తదితర పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన గిరిజన విద్యార్ధులను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఉన్నతి పథకం ద్వారా 36 మంది గిరిజన మహిళా సంఘాల సభ్యులకు రూ.18,00,000 విలువైన చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిధులను, గిరిజన సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. (Story : విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తు)