మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ చేరాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : స్వచ్చమైన మిషన్ భగీరథ తాగు నీరు హ్యాబిటేశన్ చివరి ఇంటి వరకు చేరేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం బుగ్గపల్లి తాండా వద్ద 75యం.ఎల్.డి. సామర్థ్యంతో నిర్మితమైన నీటి శుద్ధి కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. నీరు శుద్ధి చేస్తున్న పనితీరును పరిశీలించిన కలెక్టర్ నీటి క్లోరినేషన్ శాతం, పి.హెచ్ విలువలు పరిశీలించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అవసరమైన తాగు నీరు ఎంత, మిషన్ భగీరథ ద్వారా ఒక రోజుకు శుద్ధి చేస్తున్న శుద్ధ జలం ఎంత, మార్గమధ్యలో వృధా అవుతున్న నీరు ఎంత అనే వివరాలను మిషన్ భగీరథ ఎస్. ఈ ను అడిగి తెలుసుకున్నారు. ఒవర్ హెడ్ ట్యాంక్ నుండి ఊరి చివరి ఇంటి వరకు శుద్ధమైన జలం వెళ్ళాలని అక్కడ మీటర్ ద్వారా నీటి నాణ్యత పరిశీలించి వచ్చిన విలువలను రిజిస్టర్ లో నమోదు చేసేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పైప్ లైన్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, ఎక్కడైనా లీకేజి ఫిర్యాదు వస్తె వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.రోజుకు ఎంత నీరు వదలాలి అనేది నియంత్రించాలని సూచించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ కు విచ్చేసిన పాఠశాల విద్యార్థులకు నీరు ఎలా శుద్ధి అవుతుందో ఇంజనీర్లు ప్రయోగాత్మకంగా చూపించారు.పచ్చదనంలో భాగంగా అనంతరం అక్కడే ఆవరణలో మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ ఎస్. ఈ వెంకటరమణ ఉన్నారు. (Strory : మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ చేరాలి)