బొగత జలపాతంలో యువకుడి మృతి
న్యూస్‌తెలుగు/ వాజేడు వెంకటాపురం:ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బోగత జలపాతం లో యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. వరంగల్ కాశీబుగ్గకి ప్రాంతానికి చెందిన బొనగాని జస్వంత్ (18) ఏడుగురు స్నేహితులతో కలిసి బొగత జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు.
అదే క్రమంలో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ లో స్నానాలు చేస్తుండగా జస్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు.
అది గమనించిన సిబ్బంది గజ ఈతగాల్ల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.
జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులను స్విమ్మింగ్ పూల్ లోకి అనుమతించడం పై పలు విమర్శలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా బొగత జలపాతం వద్ద సరైన రెస్క్యూ సిబ్బంది లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.
విహారయాత్రలో స్నేహితులతో సరదాగా గడపాలని వచ్చిన ఏడుగురు స్నేహితులలో ఒక స్నేహితుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడంతో తోటి స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి స్నేహితులైన ధర్మ తేజ, సాయి కిరణ్, సుశాంత్, నాగేంద్ర, వంశీ, గౌస్ ల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. (Story : బొగత జలపాతంలో యువకుడి మృతి)