ఆగస్టు 15న 3 అన్నక్యాంటీన్లు ప్రారంభం
అనుమతి లేని వాటర్‌ప్లాంట్లను సీజ్ చేయాలి
మున్సిపాల్టీల్లో వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం: రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15న ప్రారంభించేందుకు జిల్లాలోని 3 అన్న క్యాంటీన్లను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లతో తన ఛాంబర్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ముందుగా మున్సిపాల్టీల్లో త్రాగునీటి సరఫరా, పారిశుధ్యంపై, వ్యాధుల వ్యాప్తిపై సమీక్షించారు.
మున్సిపాల్టీల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని, దోమల వ్యాప్తిని అరికట్టాలని, సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేయాలని కమిషనర్లను ఆదేశించారు. వారం రోజుల్లో కాలువల్లో పూడికలను తొలగించి, ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయించాలన్నారు. మలేరియా, విషజ్వరాలు, టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధుల వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో సరఫరా చేస్తున్న త్రాగునీరు కలుషితం అవ్వకుండా కట్టుధిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అన్ని ఆర్ఓ ప్లాంట్లపై దాడులు చేసి, మంగళవారం సాయంత్రానికి మూసివేయించాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా చాలావరకు వ్యాధులను నివారించవచ్చన్నారు. దీనికోసం సోషల్ మీడియా, ఛానళ్లు, పేపర్లలో ప్రకటనలు ఇవ్వాలని సూచించారు.
అన్న క్యాంటీన్లపై కలెక్టర్ సమీక్షించారు. ఆగస్టు 15 న ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాలని నిర్ణయించిందని, విజయనగరంలో రెండు, బొబ్బిలిలో ఒక క్యాంటీన్‌ను ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అలాగే రాజాం, నెల్లిమర్ల అన్న క్యాంటీన్లతోపాటు, విజయనగరం ఘోషా ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్‌ను సెప్టెంబరు 21 నాటికి సిద్దం చేయాలన్నారు. అవకాశం ఉంటే రాజాం అన్న క్యాంటీన్‌ను కూడా ఆగస్టు 15నే ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎస్‌డి అనిత, విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, నెల్లిమర్ల కమిషనర్ బాలాజీ ప్రసాద్, బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మి, రాజాం కమిషనర్ జె.రామప్పలనాయుడు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, పబ్లిక్ హెల్త్ ఇఇ దక్షిణామూర్తి, సహాయ మలేరియా అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు