ఉప్పొంగిన జంపన్న వాగు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళలను సంతరించుకుంటున్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల, మల్యాల గ్రామాల మధ్యన జంపన్న వాగు పొంగి ప్రవహిస్తున్నది. బ్రిడ్జి దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. భారీ వర్షాల దృష్ట్యా ప్రాజెక్ట్ గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని హెచ్చరించారు. (Story : ఉప్పొంగిన జంపన్న వాగు)