రెడ్ క్రాస్ సంస్థను దోచుకుతిన్న మామిళ్ళపల్లి
కఠిన చర్యలు తీసుకోవాలి..
అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్..
జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పణ..
న్యూస్ తెలుగు / ఏలూరు: తన హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన రెడ్‌క్రాస్ సంస్ధను భ్రష్టుపట్టించి, కోట్ల రూపాయల సొమ్మును దిగమింగిన రెడ్‌క్రాస్ మాజీ చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్, అతనకు సహకరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.జిల్లా రెడ్‌క్రాస్ సంస్థలో కరోనా సమయంలో జరిగిన నిధుల గోల్‌మాల్ వ్యవహారాన్ని బహిర్గతం చేయాలని, బహిరంగ విచారణ నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి రెడ్‌క్రాస్ చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి జాలా బాలాజీ మాట్లాడుతూ నిస్వార్ధమైన సేవలందించే రెడ్‌క్రాస్ సంస్థకు అవినీతి మరకలు అంటించిన మాజీ చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినా అప్పటి ఉప ముఖ్యమంత్రి అండదండలతో దోపిడి విషయాన్ని పూర్తిస్థాయిలో వెలుగులోనికి రాకుండా చేసి నిజాన్ని దాచేశారని ఆరోపించారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా సంచలనమైన భారీ స్కామ్‌లో దోషులుగా ఉన్నవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తాము లోకాయుక్తను కూడా ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్ళి ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరతామని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జాలా శివశంకర్, నాయకులు బోడా కిరణ్, పెద్దాడ వెంకటరమణ, మాకాల రమేష్, చనపతి వెంకటరమణ, గుంటూరు ప్రకాష్, మెల్లిపాక వెంకన్న,దాలి త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు. (Story : రెడ్ క్రాస్ సంస్థను దోచుకుతిన్న మామిళ్ళపల్లి)