పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే చర్యలు
విజయనగరం కమిషనర్ ఎం ఎం నాయుడు
న్యూస్‌తెలుగు/విజయనగరం: పశువులను విచ్చలవిడిగా రోడ్లపై విడిచినట్లయితే అట్టి పశువులను స్వాధీనం చేసుకుని అపరాధ రుసుములను వసూలు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. పారిశుద్ధ్యం, కాలువల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. నీళ్ళ ట్యాంక్ జంక్షన్లో రహదారిపై విచ్చలవిడిగా పశువులను విడిచి రోడ్లపైనే పశు వ్యర్ధాలు దర్శనం ఇవ్వడంతో పశు పెంపకం దారులను పిలిచి మందలించారు. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే పశువులను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసారు. అలాగే పశువులను రహదారులపై విడిచిపెట్ట రాదని చెప్పారు. అనంతరం కొత్తపేట నీళ్ళ ట్యాంక్ వద్దకు చేరుకొని అక్కడ నీటి నమూనాలను పరిశీలించారు. ట్యాంకుల పరిశుభ్రత క్రమం తప్పకుండా చేస్తున్నారా లేదా అన్నది గమనించారు. పైపులైన్లు లీకేజీలు లేకుండా సరి చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. అనంతరం కాలువలలో పూడిక పేరుకు పోవడానికి గమనించి తక్షణమే కాలువలను ప్రక్షాళన చేయాలని సూచించారు. కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించాలని చెప్పారు. లేకుంటే వర్షపు నీరు వల్ల ఆయా ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వర్షాలు కురిసే సమయంలో అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉన్న రీత్యా ముందు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి కాలువల్లో రహదారులుపై చెత్తాచెదారాలు వేయవద్దని సూచించారు. దోమలు వృద్ధి చెందే కేంద్రాలను లేకుండా చూడాలన్నారు. నీరు నిలువ లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచాలన్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విస్తర్జనలను చేయరాదని చెప్పారు. అలా చేసినట్లు గుర్తిస్తే అపరాధ రుసుమును విధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ కే.శ్రీనివాసరావు, కార్పొరేటర్ అల్లు చాణక్య, పారిశుధ్య పర్యవేక్షకులు రామకృష్ణ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. (Story: పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే చర్యలు)