రైతు బజార్‌లో దళారులదే రాజ్యం!
తిరువూరు రైతు బజార్ వద్ద టమాటా రైతుల ఆందోళన
సరుకు కొనుగోలు చేయకపోవటంపై ఈఓను నిలదీసిన రైతులు
మాజీ జెడ్పిటిసి రంగ ప్రవేశం తో సమస్య పరిష్కారం
తిరువూరు (న్యూస్ తెలుగు): పట్టణంలోని రైతు బజార్ వద్ద గురువారం సాయంత్రం మండలం లోని సూరవరంకు చెందిన టమాటా పండించే రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ రైతు బజార్ లో వున్న వారంతా దళారులే అని ఆరోపించారు. తాము పండించిన సరుకు ఎందుకు కొనుగోలు చేయటం లేదని రైతు బజార్ ఈఓ చిట్టిబాబు ను రైతులు నిలదీశారు. రైతు బజార్ ఈఓ వ్యాపారులతో కుమ్మక్కై విజయవాడ సరుకు కొనుగోలు చేసేందుకు సహకరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతు బజార్ లో తక్కువ ధరకు ఇతర కూరగాయలు కొనుగోలు చేసి బోర్డు లో ఎక్కువ ధర నిర్ణయించటం ద్వారా ఈఓ చిట్టిబాబు వ్యాపారులకు మేలు చేయటంలో ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నించారు. వ్యాపారులతో కుమ్మక్కై రైతుల శ్రమను, వినియోగదారుల జేబులను ఎస్టేట్ ఆఫీసర్ దోచుకుంటున్నారని రైతులు మండి పడ్డారు.నిబంధనలకు విరుద్ధంగా రైతు బజార్, మార్కెట్ రెండు చోట్ల దుకాణాలు నడుపుతూ ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడ సరుకు విక్రయిస్తూ రైతు బజార్ లో వ్యాపారులు ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తున్నా అధికారి చూసి చూడనట్లు నటిస్తున్నారన్నారు. ఈ విషయంపై ఈ ఓ చిట్టి బాబును వివరణ కోరగా రైతు బజార్ లో వ్యాపారులను స్థానిక రైతుల వద్ద సరుకు కొనుగోలు చేయమనే అధికారం తనకు లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యను రైతులు మాజీ జెడ్పిటిసి గద్దె రమణ దృష్టికి తీసుకు వెళ్లగా సత్వరం స్పందించిన జడ్పిటిసి రైతు బజార్ వద్దకు వచ్చి ఈఓ చిట్టిబాబు తో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని కోరగా రైతులు దరఖాస్తులు సమర్పిస్తే సరుకు అయి పోయే వరకు అమ్ముకునే అవకాశం కల్పిస్తామని రైతులకు ఈఓ చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రైతులు తీసుకు వచ్చిన టమోట సరుకును రైతు బజార్ వ్యాపారులు కొనుగోలు చేయటంతో వివాదం సద్దు మణిగింది. (Story: రైతు బజార్‌లో దళారులదే రాజ్యం!)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2