నిబంధనల పేరిట చిన్న, మధ్య పత్రికల గొంతు నొక్కుతున్న ప్రభుత్వం
విజయవాడ: అక్రిడిటేషన్ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పత్రికల గొంతు నొక్కుతుందని ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే గౌరవ సలహాదారులు అంబటి ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర చిన్న,మధ్య తరహా పత్రికల సంఘం సామ్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడ, గాంధీనగర్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పత్రికలకు ఇచ్చే అక్రిడిటేషన్లను తగ్గించేందుకు రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ వింతైన నియమ నిబంధనలు విధిస్తున్నారని విమర్శించారు. కమిషనర్ పైకి చెప్పేదొకటి చేసేది ఒకటిగా ఉంటుందని ఆయన ఆరోపించారు. జర్నలిస్టుల సంక్షేమం పట్టని ప్రభుత్వంపై ఉద్యమం చేసేందుకు ఈనెల 13వ తేదీన విజయవాడలో ఒక సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. ఉద్యమ కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ సమాచార, పౌర సంబంధాల శాఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, అక్రిడిటేషన్ల సంఖ్య తగ్గించేందుకు అధికారులు కొత్త నియమావళిని రూపొందించారని విమర్శించారు. మండల స్థాయి అక్రిడేషన్ల మంజూరుకు సర్కులేషన్ పరంగా నిబంధనలు విధించడం అనేది దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు అందే విధంగా చేయడంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. కొత్త జిల్లాలలో సామ్నా ప్రాతినిధ్యం కలిగి ఉండే దిశగా కార్యవర్గం కృషి చేయాలని ఆయన సూచించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పత్రికల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు. ఏపీయూడబ్ల్యూజే పోరాట ఫలితంగానే అక్రిడేషన్ల మంజూరుకు గతంలో విధించిన జీఎస్టీ నిబంధనను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. సభకు అధ్యక్షత వహించిన సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పత్రికల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే చొరవ తీసుకొని పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల పట్ల చులకన భాగంగా చూస్తున్న ప్రభుత్వ వైఖరి పై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చిన్న పత్రికల ప్రచురణ 10 సంవత్సరాలు నిర్వహించి, ప్రస్తుతం పీడీఎఫ్ పత్రికలను నడుపుతున్న సీనియర్ జర్నలిస్టులకు వారి సీనియారిటీ ఆధారంగా అక్రిడేషన్లు మంజూరు చేయాలని సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా చిన్న పత్రికల వారికి జిల్లాలో 1+1 చొప్పున అక్రిడేషన్ మంజూరు చేస్తూ అందులో ఒకటి స్టేట్ అక్రిడేషన్ ఉండేవిధంగా చూడాలని తీర్మానం చేశారు. ఐటీ రిటర్న్ నిబంధనను ఎత్తివేయాలని తీర్మానించారు. చిన్న పత్రికలకు నియోజకవర్గానికి ఒక అక్రిడిటేషన్ మంజూరు చేసే విధంగా చూడాలని తీర్మానం చేశారు. 50 శాతం పైగా పత్రికల హాజరు ఉన్న వారికి ఈసారి అక్రిడిటేషన్ల మంజూరులో మినహాయింపు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు చిన్న పత్రికల ప్రతినిధులు తమ తమ సమస్యలను వివరించారు. చివరగా సామ్నా విజయవాడ నగర అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు వందన సమర్పణ చేశారు. (Story: పత్రికల గొంతు నొక్కుతున్న ప్రభుత్వం)
See Also :