ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!
మీడియాఫైల్స్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిపదవులపై ఊహాగానాలు ఊరేగుతున్నాయి. మార్చి 15వ తేదీన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇప్పుడున్న మంత్రుల్లో ఉండేదెవరో? ఊడేదెవరో? కొత్తగా వచ్చేదెవరో? నిరాశపడేదెవరో?…ఇలా తలా ఒక ప్రశ్నార్థకంతో ఎవరికివారు అభిప్రాయాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఎప్పుడున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రిపదవులపై ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో కొంతమంది మాత్రం కచ్చితంగా మంత్రిపదవి పొందాలని ఆశిస్తున్నారు. అందులో సీనియర్లు, జూనియర్లు… ఇద్దరూ ఉన్నారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే పక్షంలో కచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నవారిలో శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందువరుసలో వున్నారు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా వున్న ధర్మాన కృష్ణదాసు భవితవ్యం ఏమిటనేది తేలినా తేలకపోయినా ఈసారి మార్పులు చేర్పుల్లో తాను వుండాలని ధర్మాన గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆయన మంచిమాటకారి. మంత్రిగా అనుభవజ్ఞులు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ధర్మాన ప్రసాదరావు మంత్రిపదవి గ్యారంటీ అని నమ్మారు. కానీ అనూహ్యంగా ఆ పదవి సోదరుడు కృష్ణదాసుకు దక్కింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం పూర్తిగా మారుతుందని జగన్ ఆనాడే చెప్పడంతో ద్వితీయార్థంలోనైనా తనకు పదవి దక్కుతుందని ధర్మాన ప్రసాదరావు ఆశిస్తూవచ్చారు. ముఖ్యమంత్రి కూడా ప్రసాదరావుకు మంత్రిపదవి ఇవ్వడం పట్ల సుముఖంగా వున్నట్లు సీఎం సలహాదారు వర్గాలు తెలిపాయి.
శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగిరీ ఆశిస్తున్నవారిలో తమ్మినేని సీతారాం కూడా వున్నారు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ పదవి కన్నా ఆయనకు మంత్రిపదవే ఇష్టం. గతంలో కూడా ఆయన అదే ఆశించారు. కానీ అనుభవం పేరుతో స్పీకర్ పదవిని అంటగట్టారు. ఈసారి పునర్వ్యవస్థీకరణలో తనకు మంత్రిపదవి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. కాకపోతే ఆయన కాంక్ష సీఎం వరకూ చేరిందో లేదో! సీతారాంకు మంత్రిపదవి దక్కితే, మరో సీనియర్ శాసనసభ్యులు స్పీకర్ కావాల్సి వుంటుంది. ఇప్పుడిక సీఎం స్పీకర్ పదవి కోసం సీనియర్‌ను అన్వేషించాల్సి వుంటుంది. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు ఇరువురూ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారైనా రెండు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో ఇద్దరూ ఆ పదవులను ఆశించడంలో తప్పులేదు. ఇద్దరికీ పదవులిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. వారిద్దరూ బీసీలే కావడం గమనార్హం.
కృష్ణాజిల్లాకు చెందిన కొలుసు పార్థసారథి, జోగి రమేశ్‌లు మంత్రిపదవులను ఆశిస్తున్నవారిలో ముందువరుసలో వున్నారు. పార్థసారథికి గతానుభవం వుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు విమర్శలు చేసినా వెంటనే స్పందిస్తున్న వారిలో ఆయనొకరు. యాదవ సామాజికవర్గానికి చెందిన పార్థసారథికి సొంత జిల్లా నుంచి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ నుంచే పోటీ వుంది. గౌడ కులానికి చెందిన జోగి రమేశ్ వైసీపీ నేతల్లో ముఖ్యునిగా ఎదుగుతూ వచ్చారు. కాకపోతే ఇద్దరికీ మంత్రిపదవులు కష్టసాధ్యం కావచ్చు. ఎందుకంటే మచిలీపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పడుతున్న కృష్ణాజిల్లాకు చెందినవారే వీరిద్దరూ. ఇప్పటికే ఈ కొత్త జిల్లా నుంచి పి.వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)లు మంత్రులుగా వున్నారు. వీరిద్దరికీ విశ్రాంతి లభిస్తే, జోగి, పార్థసారథిలకు పదవులు దక్కవచ్చు. ఎన్టీయార్ జిల్లా నుంచి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కరే ఉన్నారు. మల్లాది విష్ణు ఈసారి వెల్లంపల్లి స్థానంలో మంత్రిపదవి ఆశిస్తున్నారు.
కాపు సామాజికవర్గం నుంచి ఎంతమంది పోటీపడినా… సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), అంబటి రాంబాబు (సత్తెనపల్లి)లకు మంత్రిపదవులు వరించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. కాకపోతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (తూ.గో) కూడా ఈ పోటీలో వున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోటీలో వున్నప్పటికీ, కృష్ణాజిల్లా నుంచి ఆశావహులు ఇప్పటికే ఎక్కువమంది అయ్యారు. అయితే కమ్మ సామాజికవర్గం నుంచి వసంత ఛాన్స్ కొట్టే అవకాశం లేకపోలేదు. భూమన కరుణాకరరెడ్డి (తిరుపతి), అనంత వెంకట్రామరెడ్డి (అనంతపురం), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)లు రేసులో వున్నారు. వీరంతా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. పైగా అందరూ రాయలసీమ వాసులే. ఎస్టీల నుంచి భాగ్యలక్ష్మి (పాడేరు), ఎస్సీల నుంచి గొల్ల బాబూరావు (పాయకరావుపేట), తలారి వెంకటరావు (గోపాలపురం), వరప్రసాదరావు (గూడూరు)లు పదవులు ఆశిస్తున్నారు.
ప్రస్తుత గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధరాజుకు సెలవిచ్చే పక్షంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజును తీసుకునే అవకాశం లేకపోలేదు. మహిళల్లో ఆర్‌కే రోజా (నగరి), జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల), విడదల రజని (చిలకలూరిపేట), రెడ్డి శాంతి (పాతపట్నం)లు పోటీలో వున్నారు. వీరిలో రోజాతోపాటు ఇంకొకరికి మంత్రిపదవి దక్కే అవకాశం వుంది. మహిళల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కుతుందని భావిస్తున్నారు. వీరుగాకుండా, హఫీజ్‌ఖాన్ (కర్నూలు), నవాజ్ బాషా (మదనపల్లె)లు కూడా మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు.
వీరందరిలో పది మందికి కచ్చితంగా మంత్రిపదవులు దక్కే అవకాశాలు మెండుగా వున్నాయి. ఏప్రిల్‌లో జరిగే వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ తర్వాతనే క్యాబినెట్ విస్తరణ వుంటుందని జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అప్పటివరకు ఎవరికివారు తమ తమ ప్రయత్నాల్లో మునిగితేలాల్సి వుంటుంది. (Story: ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
See Also: తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!
See Also: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అసలు రివ్యూ ఇదే!