ఇకపై మహిళల ఐపీఎల్
ముంబయి: ఇప్పటివరకు పురుషుల ఐపీఎల్ మాత్రమే ఎంతగానో అలరించింది. ఇకముందు మహిళల ఐపీఎల్ కూడా రాబోతున్నది. ఏడాది క్రితం మహిళా క్రికెటర్ల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మహిళా క్రికెటర్ల కోసం 2023వ సంవత్సరం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఏడాది విరామం తర్వాత ఈసారి అంటే 2022లో నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో సరిపెట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో 5 నుంచి 6 జట్లను ఆడిరచాలని, ఈ మేరకు ఫ్రాంఛైజీల ఎంపిక జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ చెప్పారు. బీసీసీఐ ఏజీఎం ఆమోదం పొందగానే మహిళల ఐపీఎల్ ఏర్పాట్లు మొదలవుతాయి. శుక్రవారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానంతరం గంగూలీ మీడియాతో మాట్లాడారు. పురుషుల ఐపీఎల్ శనివారం ప్రారంభమవుతున్నది. కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ ప్లేఆఫ్‌లు జరుగుతున్న సమయంలోనే మహిళల కోసం నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరుగుతాయని, ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో మూడు మహిళా జట్లు పాల్గొంటాయని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లన్నీ పూణేలో జరిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. 2020లో యుఏఈలో జరిగిన మహిళల ఐపీఎల్ ఎగ్జిబిషన్ టోర్నీలో ట్రయల్ బ్లేజర్స్ విజయం సాధించింది. (Story: ఇకపై మహిళల ఐపీఎల్)
See Also: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అసలు రివ్యూ ఇదే!