తల్లిపాలు అమృతంతో సమానం..
సీడీపీఓ బి. అరుణ
న్యూస్ తెలుగు / వినుకొండ : తల్లి పాలు బిడ్డకు పరిపూర్ణ ఆరోగ్యంతో పాటు అమృతంలా పని చేస్తాయని సిడిపిఓ బి.అరుణ అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం, ముప్పాళ్ళ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో 7వ పోషణ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిడిపిఓ బి.అరుణ మాట్లాడుతూ. గర్భిణీ, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం మూలంగా వివిధ వ్యాధులను దూరం చేయవచ్చునని, గర్భిణులు, బాలింతలు తినే ఆహారంలో చిరుధాన్యాలు చేర్చుకోవాలని అలాగే ఆకుకూరలు, కాయకూరలు తప్పనిసరి గా తీసుకోవాలని సూచనలిచ్చారు. ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముర్రుపాలు గురించి, 6 నెలలు పాటు తప్పకుండా తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం సూపర్వైజర్ చిన్నమ్మాయి మాట్లాడుతూ. ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలన్నారు.
పిల్లల తల్లులకు ఇచ్చిన గ్రోత్ కార్డులలో బరువు సూచించిన విధంగా ఉండాలని ప్రతి నెల పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి తీసుకువచ్చి పిల్లల బరువులు ఎత్తు లు తనిఖీ చేయించి వారి ఎత్తు, బరువు, పెరిగేలా చూడాలని చెప్పారు. అలాగే ఫ్రీ స్కూల్ కు వచ్చే పిల్లలను ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడి కేంద్రాలకు పంపిస్తే ఆటపాటల విద్యతో పాటు అంగన్వాడి టీచర్లు పిల్లలను తల్లులుగా చూసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సీతా కుమారి, మహబూబ్, చౌడేశ్వరి, వెంకటమ్మ, బెంజమ్మ, అంగన్వాడీ ఆయాలు, గర్భిణీలు బాలింతలు, తల్లులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామస్తులు పాల్గొన్నారు. (Story:తల్లిపాలు అమృతంతో సమానం..)