ప్రాజెక్టుల పూడిక తీసివేతకు త్వరలో టెండర్లు
సాగునీరందించి జిల్లా పూర్వ వైభవం – పీసీసీ అధ్యక్షులు
న్యూస్తెలుగు/నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ల పూడిక తీయడానికి త్వరలో టెండర్ ప్రక్రియ చేపడుతున్నట్టు పీసీసీ అధ్యక్షులు పి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21, 22, పూర్తి చేసి 4లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన అన్నారు. మంగళవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రశాంగించారు. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయ జిల్లా అనే విధంగా ప్రయత్నం చేస్తూ
గుత్ప, అలీ సాగర్ మరమ్మతులు చేపడుతామన్నారు. జిల్లాకు వ్యవసాయ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కల సాకారం చేసే ప్రయత్నం చేస్తున్నామని, జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులు తయారవుతున్న సందర్భంలో ఇక్కడ మినీ స్టేడియం, సింథటిక్ ట్రాక్ వస్తుందని, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామన్నారు. పారిశ్రామిక విషయంలో నందిపేట సేజ్ ను ముందుకు తీసుకువెళ్తామని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థాపనకు సుదర్శన్ రెడ్డి కృషి చేస్తున్నారని సాకారం జరుగుతుందని తెలిపారు. బిఆర్ ఎస్ హయంలో ఫ్యాక్టరీ తేలేదని, అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఇంకా మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. 10ఏళ్ల కాలంలో నిజామాబాద్ కు ఏం చేశారో ప్రశాంత్ రెడ్డి చెప్పగలడా అని ప్రశ్నించారు. జిల్లాలో భారాస పని అయిపోయిందని విమర్శించారు. కుల గణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, 42 శాతం రిజర్వేషన్ పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వివరించారు. రాహుల్ గాంధీ ప్రతి సందర్బాలో తెలంగాణ గురించే మాట్లాడుతున్నారని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి మా బాధ్యతని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజల చేత మెప్పు పొంది మళ్ళీ 90 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడ చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రాజెక్టుల పూడిక తీసివేతకు త్వరలో టెండర్లు)

