నిరుద్యోగుల కోసం క్యూఆర్ కోడ్ ద్వారా ఉద్యోగ ఇంటర్వ్యూలు
సీడాప్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వం తరఫున విడుదల చేసిన పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు నమోదు చేసుకుంటే చాలు నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. క్యూఆర్ కోడ్ ను ఉద్యోగార్థులు సెల్ ఫోన్ లో స్కాన్ చేస్తే కంపెనీ వివరాలతో పాటు ఏయే ఉద్యోగాలు ఉన్నాయి? అర్హతలు ఏమిటి? తదితర అంశాలు సెల్ ఫోన్ కు వచ్చేలా ఏర్పాటు చేశారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుని వస్తోందన్నారు. నిరుద్యోగులంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం తన కార్యాలయంలో అందుకు సంబంధించిన పోస్టర్‌ను సతీసమేతంగా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. 10వ తరగతి, ఆ పైన చదివిన వారు ఎవరైనా ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందవచ్చన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్స్ విభాగంలోని సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రై జ్ డెవలప్‌మెంట్ సంస్థ – సీడాప్ ద్వారా ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోందన్నారు. ఆ పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న యువతకు నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్ల నుంచి సంస్థలను ఆహ్వానించి ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు అందించడం వరకు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. ఉగాది రోజున యువత కోసం ఇలా కొత్త అవకాశాలు అందించే క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే మక్కెన మల్లికార్జునరావు, పట్టణ, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.(Story : నిరుద్యోగుల కోసం క్యూఆర్ కోడ్ ద్వారా ఉద్యోగ ఇంటర్వ్యూలు)