ఐదో షెడ్యూల్ ప్రాంతానికి 1/70 చట్టం ఆదివాసుల అభివృద్ధికి జీవ నాడి
ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలోని 1/70 చట్టం ఆదివాసుల అభివృద్ధికి జీవనాడి అని అన్నారు. ఐదవ షెడ్యూలు భూభాగంలో ఉన్న ప్రాంతాలలోని చట్టాలు ,జీవోలు పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ పరిపాలన శాఖను (కార్యాలయాన్ని) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఏజేన్సీ ప్రాంత భూముల రక్షణకు ఉద్దేశించిన 1/70 భూ బదలాయింపు నిషేద చట్టం అభివృద్దికి అడ్డంకి కాదని, ఆ చట్టమే లేకపోతే ఆదివాసులు అంతరించి పోయేవారని, ఈ చట్టం బ్రిటిష్ కాలం నుండి ఉందని దాని చరిత్ర తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్రమ వ్యాపారాలకు అడ్డం వస్తుందని 1/70 చట్టాన్ని సవరణ చేయాలని అనడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు ఘాటుగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్లు రూపాయలు ఖర్చు పెడుతున్న పాలకులకు చిత్తశుద్ధి లేక ఆదివాసుల అభివృద్ది సాధ్యం కావడం లేదని, ఆదివాసులను అభివృద్ధి చేయడం ఇష్టం లేనివారు చట్టాలు అడ్డం పడుతున్నాయని పచ్చి బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు.
శాసనసభలో స్పీకర్ పదవి అత్యంత పవిత్రమైనదని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం సభాపతి అనుమతి తీసుకుని మాట్లాడవసి ఉంటుందని, అటువంటి పవిత్రమైన పదవిలో ఉండి ఆదివాసుల రక్షణ చట్టాలపై గౌరవం లేని అయ్యన్నపాత్రుడు సభాపతి కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా, అయ్యన్న పాత్రుడు సభాపతిలా కాకుండా “మైనింగ్ డాన్”లా మాట్లాడుతున్నాడని ఘాటు విమర్శ చేసారు. అణగారిన ప్రజల పట్ల బాద్యత రాహిత్యంగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల రక్షణ చట్టాలకు భంగం కలుగకుండా వారిని ఎలా అభివృద్ధి చేయాలో టిసిఆర్ఐ&టిఐ, దేబార్ కమిషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్గదర్శకాలు చేశాయని, వాటిని తుంగలో తొక్కి అవహేళన చేసి మాట్లాడుతున్నారని అన్నారు.
ఏజెన్సి ప్రాంత పరిపాలన, భూములు, అడవులు, వనరుల రక్షణకు అనేక చట్టాలు ఉన్నవాటిని పట్టించుకోకుండా విద్య, ఉద్యోగ, ఉపాది, రాజకీయ పదవులు, వనరుల దోపిడీ యదాతదంగా జరుగుతున్నాయని అన్నారు. అయ్యన్నపాత్రుడి వాక్యాలను వెనక్కి తీసుకోకపోతే త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం చిన్న వీరభద్రం మండల నాయకులుసోడే రాఘవయ్య, సోడి ప్రసాదు కారం వెంకటేశ్వర్లు శీలం కృష్ణ రవ్వ ప్రసాదు బొద్దెల లక్ష్మణ్ , సవలం కోటి బంధం రాజు ఇరుకం శ్రీరాములు పోడియం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. (Story : ఐదో షెడ్యూల్ ప్రాంతానికి 1/70 చట్టం ఆదివాసుల అభివృద్ధికి జీవ నాడి )