కనీస వేతన చట్టం అమలు చేయాలి
న్యూస్ తెలుగు/విజయవాడ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీసం వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్‌గాంధీ పార్కులో శుక్రవారం జరిగిన పార్కు కార్మికుల కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, బుడవేరు వరద ముంపు సమయంలో కార్మికుల చేసిన కృషికి ఫలితంగా ఒక నెల జీతం బోనస్‌గా ప్రకటించాలన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా మాట్లాడుతూ రూ.1500 ఉన్న జీతాన్ని దఫ దఫాలుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాడిన ఫలితంగా ప్రస్తుతం రూ.21000 జీతాన్ని పొందుతున్నారని గుర్తు చేశారు. పోరాటాల ఫలితంగానే డిమాండ్‌లను సాధించుకోగలమని ప్రతి కార్మికులు గుర్తుంచుకోవాలన్నారు. కార్మిక చట్టాలు అమలు, న్యాయస్థానాల ఆదేశాలు అమలులో పాలుకులు నిర్లక్ష్యం వహిస్తే కలిసి కట్టుగా పోరాడేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జక్కి జేమ్స్, కోశాధికారి తుపాకులు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్, విజయ్ పాల్గొన్నారు. (Story : కనీస వేతన చట్టం అమలు చేయాలి)