UA-35385725-1 UA-35385725-1

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్ఫ్ మరియు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు, ఎన్.ఆర్.ఐ. సాధికారత మరియు సంబంధాల శాఖామాత్యులు – కొండపల్లి శ్రీనివాస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంను జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోగల ‘స్మృతి వనం’లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అథిధిగా హాజరై, అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ సంవత్సరం అమరులైన 216మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించగా, విధులు నిర్వహిస్తూ, తీవ్రవాదులదాడుల్లో మృతి చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లును అదనపు ఎస్పీ పి. సౌమ్యాలత చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన
రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ – ప్రజారక్షణలో పోలీసులు విధులను నిర్వహిస్తూ కొన్నిసార్లు ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితి వస్తున్నదని, అయినప్పటికీ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ విధులను నిర్వహించడంలో వెనుకంజ వేయకపోవడంను ప్రతీ ఒక్క పోలీసు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తేనే దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారని, పోలీసులు రాత్రి అనక, పగలనకా, కాలాతీతంగా, వాతావరణంతో పని లేకుండానే విధులు నిర్వహించడం వలనే నేడు మనందరం ఎంతో సురక్షితంగా జీవించగలుగుతున్నామన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతో ధైర్య, సాహసాలుతో మావోయిస్టుల చర్యలను ఎదుర్కొంటూ విధులు నిర్వహించి అమరులైన ముద్ధాడ గాంధీ, చిట్టిపంతుల చిరంజీవి, షేక్ ఇస్మాయిల్, బి.శ్రీరాములు, ఎస్.సూర్యనారాయణ నేడు మన మధ్య లేనప్పటికీ, వారి త్యాగాలను మరువలేమని, వారు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని, ఎప్పుడు ఏ అవసరమున్నా సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
జిల్లా కలెక్టరు డా. బి.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ – శాంతిభద్రతలు కాపాడుటలో భాగంగా పోలీసులు తమ రోజువారి విధులను నిర్వహిస్తూ, విధులను నిర్వహించే క్రమంలో ప్రాణాలను కోల్పోవడం దురదృష్టకరమైనప్పటికీ, అన్ని వృత్తుల్లోకి పోలీసు ఉద్యోగానికి ప్రజల్లో ప్రత్యేకమైన గౌరవం ఉందన్నారు. పోలీసులు నిర్వహించే విధులు ప్రతీ ఒక్కరిలో ఉత్తేజం, స్ఫూర్తి కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – విధి నిర్వహణలో పోలీసులు రాగద్వేషాలకు అతీతంగా, ఎంతో క్రమ శిక్షణతో, నిబద్ధతతో, సంయమనం పాటిస్తూ, ఎండలోను, వానలోను, 24×7 విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో 216మంది పోలీసులు వివిధ విభాగాల్లో పని చేస్తూ, తమ ప్రాణాలను కోల్పోయారని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు మనందరిలో చిరంజీవులుగా నిలిచిపోయారన్నారు. అంతేకాకుండా, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 21-31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

అనంతరం, అమరులైన పోలీసులను స్మరించుకొంటూ, అమర వీరుల స్మృతి స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలను వుంచి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మేల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, కలెక్టరు డా.బి.ఆర్. అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ సౌమ్యలత, విధి నిర్వహణలో అవరులైన చిట్టిపంతుల చిరంజీవిరావు, షేక్ ఇస్మాయిల్, ఎస్.సూర్యనారాయణ కుటుంబ సభ్యులు, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరుల స్థూపం వద్ద రీత్ లను, పుష్పాలను సమర్పించి, పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్.గోపాల నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరేడ్ నిర్వహించగా, అమర వీరులకు తుపాకుల విన్యాసంతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వెలమల శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ, 2 నిమిషాలు మౌనం పాటించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలతో మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, కలెక్టరు డా. బిఆర్ అంబేద్కర్, ఎమ్మేల్యే అధితి విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మరియు ఇతర పోలీసు అధికారులు మమేకమై, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, వారికి. పండ్లు,నగదును అందజేసి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న భరోసాను కల్పించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి దిశ పోలీసు స్టేషను వరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల సేవలను కీర్తిస్తూ, ర్యాలీ, మానవ హారం నిర్వహించి, నినాదాలు చేసారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే ఆతిథి విజయలక్ష్మి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు, జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఇంటిలిజెన్సు అధికారి వెంకట నాయుడు, ఎ.ఓ. శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఆర్ఐలు, డిపిఒ పర్యవేక్షకులు, ప్రభాకరరావు, వెంకటలక్ష్మి, పోలీసు అసోసియేషను రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. శ్రీనివాసరావు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, పలువురు ఎస్సైలు, ఆర్.ఎస్.ఐ.లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. (Story : పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1