UA-35385725-1 UA-35385725-1

Devara Review: దేవర మూవీ అసలుసిసలు రివ్యూ!

Devara Review: దేవర మూవీ అసలుసిసలు రివ్యూ!

నటీనటులు: జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ ఆలీఖాన్‌, శ్రీకాంత్‌, అజయ్‌, ప్రకాశ్‌రాజ్‌, మురళీశర్మ తదితరులు
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: నందమూరి కల్యాణ్‌ రామ్‌
సంగీతం: అనిరుధ్‌
సినిమాటోగ్రఫి: రత్నవేలు
ఎడిటర్‌: శ్రీకర ప్రసాద్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్‌
బ్యానర్‌: ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌
రిలీజ్‌ డేట్‌: 27-09-2024

నందమూరి తారక రామారావు (జూనియర్‌ ఎన్‌టీఆర్‌) ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా నటించిన మూవీ దేవర. అది కూడా రెండు భాగాలు. ఒక ఫిక్షన్‌ ప్రాంతం ఎర్రసముద్ర తీరాన నాలుగు గ్రామాల చుట్టూ తిరిగే ఓ కథతో భారీ ఎలివేషన్‌తో, ఒళ్లు గగుర్పొడిచే కథనంతో కొరటాల శివ రూపొందించిన దేవర మూవీ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇంతకీ ఈ మూవీ హిట్టయిందా? ఫట్టయిందా అన్నది ఈ రివ్యూలో చూద్దాం.

కథ ఏమిటంటే?
సినిమా ఆరంభమే ఎలివేషన్‌తో షురువైంది. 1996లో నిఘా వర్గాల హెచ్చరికతో శివం (అజయ్‌) అనే పోలీసు అధికారి యతి అనే మాఫియా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వెళ్తాడు. ఆ మాఫియాను పట్టుకునే ముందు దేవర గురించి తెలుసుకోవాలంటూ సింగప్ప (ప్రకాశ్‌రాజ్‌) ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడంతో కథ మొదలవుతుంది. ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలోని కొండ ప్రాంతంలో దేవర (ఎన్టీఆర్‌), భైరా (సైఫ్‌ ఆలీఖాన్‌) తన స్నేహితులు (శ్రీకాంత్‌, చాకో) కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురగ (మురశీ శర్మ) అనే ఆసామి వారికి భారీగా డబ్బు వచ్చేలా పని ఇస్తుంటాడు. నిజానికి వారిది స్మగ్లింగ్‌ వ్యాపారం. సముద్రంలో అధికారుల కళ్లు గప్పి సరుకును ఈ గ్యాంగ్‌ తరలిస్తుంటుంది. అయితే మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ల కూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను మట్టు పెట్టడానికి స్నేహితుడు భైర ప్లాన్‌ వేస్తాడు. ఆ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకొంటాడు. అదే కథకు మలుపు.

అసలు ఎర్రసముద్రం ఎక్కడుంది? ప్రకాశ్‌రాజ్‌ ఎవరు? ఎర్రసముద్రంపై వేటకు వెళ్లకూడదనే ఆంక్షల్ని దేవర ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను భైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకొన్నాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకొన్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి వెళ్లాడు? భైరా గ్యాంగ్‌కు భయం ఎందుకు చూపించాలని అనుకొన్నాడు. దేవర కుమారుడు (వర) పిరికి వాడిగా ఎందుకు మారాడు? వరతో తంగం (జాన్వీ కపూర్‌) ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు దేవర తిరిగి వచ్చాడా? నాలుగు గ్రామాల కోసం వర ఏం చేశాడు? ఇండియాలో వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచులు జరిగే స్టేడియాలపై బాంబు దాడి చేసేందుకు యతి మాఫియా చేసిన ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా? బాహుబలి లాంటి ట్విస్ట్‌తోనే తొలి భాగం ముగించిన కొరటాల ఈ విషయంలో విజయం సాధించాడా? ఇంతకీ ఇద్దరు ఎన్‌టీఆర్‌లూ తండ్రీకొడుకులేనా? అనే ప్రశ్నలకు సమాధానమే దేవర సినిమా కథ.

కథనం ఎలా ఉంది?
దేవర గురించి తెలుసుకోవాలంటూ సింగప్ప (ప్రకాశ్‌ రాజ్‌) చెప్పే కథతో మూవీ ఎమోషనల్‌గా మారుతుంది. మూవీ ఆఖరిలో బీభత్సమైన ట్విస్ట్‌లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఎన్‌టీఆర్‌, సైఫ్‌ ఆలీఖాన్‌ పోటాపోటీగా నటించడం, వీరి కాంబినేషన్‌ సీన్లు పవర్‌ఫుల్‌గా ఉండటంతో మూవీ ఫస్టాఫ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. ఓ భారీ ట్విస్టుతో ఫస్టాఫ్‌ ముగించడం వల్ల ఇంటర్వెల్‌ ఎప్పుడవుతుందా? అన్న ఉత్సుకత కలిగించారు. కానీ సెకండాఫ్‌ లవ్‌ ట్రాక్‌ సాగదీయడం, మూవీని ఆహ్లాదకరంగా నడిపడానికి చేసిన ప్రయత్నం కొంత విసుగు తెప్పించినా, ప్రీ క్లైమాక్స్‌ నుంచి సినిమాను ఒక ఎత్తు ఎత్తేశారు. సినిమా ద్వితీయార్థంలో దేవర కనిపించకుండా పోయాక.. ఆయన కుమారుడు వర, తంగం మధ్య లవ్‌ ట్రాక్‌, కొన్ని యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌ నుంచి చివరి సీన్‌ వరకు స్టోరిని, సన్నివేశాల్లో ట్విస్టులను చొప్పించిన విధానం సినిమాను గ్రిప్‌లోకి తీసుకుంటుంది. దేవరకు సంబంధించిన ట్విస్టు ఫ్యాన్స్‌కు హైప్‌కు తీసుకువెళ్తుంది. కొరటాల శివ స్క్రీన్‌ప్లేపై విమర్శలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎన్‌టీఆర్‌ సినిమా కాబట్టి అలాగే ఉంటుందని సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది.

యాక్టర్స్‌ పెర్ఫార్మెన్స్‌
జూనియర్‌ ఎన్టీఆర్‌ రెండు పాత్రల్లో ప్రదర్శించిన నటన అద్వితీయం. అతను తన హావభావాలతో మరోసారి టాలీవుడ్‌లో తన స్టయిల్‌ వేరని నిరూపించాడు. రెండు పాత్రల్లోనూ చాలా హుందాగా కనిపించి, సినిమాను పూర్తిగా తన చుట్టూ తిప్పుకున్నాడు. రౌద్రం, అమాయకత్వం అంశాలను రెండు పాత్రల్లో ఏకకాలం చూపించి మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్లలో యంగ్‌ టైగర్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫైట్స్‌, రొమాంటిక్‌ సీన్లలో జాన్వీ కపూర్‌తో కలిసి ఫ్యాన్స్‌ను కేక పెట్టించే ప్రయత్నం చేశాడు. జాన్వీ కపూర్‌ ఉన్నంత సేపు తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. సైఫ్‌ ఆలీఖాన్‌ కొత్త విలనిజం పండిరచడమే కాకుండా ఈ సినిమాకు ప్రధాన ఎసెట్‌గా నిలిచాడు. శ్రీకాంత్‌, అజయ్‌, ప్రకాశ్‌ రాజ్‌, జాన్వీ కపూర్‌ తమ పాత్రల పరిధి మేరకు నటించి, మెప్పించారు.

సాంకేతిక పనితీరు
దేవర మూవీ సాంకేతికంగా అత్యున్నత విలువలతో కూడిన సినిమాగా ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా అనిరుధ్‌ సంగీతం అదిరిపోయింది. దేవర సినిమాకు అత్యంత బలం అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కావడం విశేషం. అలాగే, రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా మరో సగం మార్కులు కొట్టేసింది. ఈ రెండు విభాగాలు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. సముద్ర తీరం.. అలాగే కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా కెమెరాల బంధించగా, అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు వాటికి మరింత బలాన్నిచ్చాయి. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ బ్యానర్‌లో ఈ సినిమా ఉత్తమ సాంకేతిక, నిర్మాణ విలువలను పొందింది. కాకపోతే గ్రాఫిక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తే బాగుండేది. బహుశా ఈ తప్పిదాలు దేవర పార్ట్‌2లో సరిచేసుకోవచ్చు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య మూవీతో అట్టర్‌ఫ్లాప్‌ అందుకున్న కొరటాల శివ మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఎంతో జాగ్రత్తగా దేవర మూవీని తీసి చప్పట్లు కొట్టించుకున్నాడు. ఈ మూవీలో దర్శక నైపుణ్యత అడుగడుగునా కన్పిస్తుంది.

ఓవరాల్‌ రేటింగ్‌
దేవర సినిమాకు 4స్టార్‌ రేటింగ్‌ను కచ్చితంగా ఇవ్వవచ్చు. దానికి కారణం ఉద్విగ్నభరితమైన సన్నివేశాలు, శక్తివంతమైన కథనం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు, ఎన్‌టీఆర్‌, సైఫ్‌ ఆలీఖాన్‌ల నటన, పాత్ర చిన్నదైనా జాన్వీ అందచందాలు.. వెరసి ఈ మూవీని మంచి రేటింగ్‌కు తీసుకువెళ్లాయి. ఆరేళ్ల తర్వాత ఎన్‌టీఆర్‌ సోలోగా వచ్చిన మూవీ కావడంతో అతని అభిమానులకు ఇది పండగే. మూలకథలో కొత్తదనం లేకపోయినప్పటికీ, ఇదొక డిఫరెంట్‌ జానర్‌ మూవీగా చెప్పవచ్చు. సినిమాపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వెళ్తే కచ్చితంగా మంచి అనుభూతిని పొందవచ్చు. ఈ మూవీ సెకండాఫ్‌లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఎలా ఉన్నాయో, పార్ట్‌`2లో అలాంటి సన్నివేశాలు మరిన్ని ఉంటాయని కొరటాల శివ చెప్పకనే చెప్పాడు. (Story : Devara Review: దేవర మూవీ అసలుసిసలు రివ్యూ!)

Related Articles

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1