అమెరికాలో నిఖిత హత్య కేసులో పురోగతి
– ఢిల్లీలో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్
– ఎనిమిది నెలల పోరాటానికి దక్కిన విజయం
– యూఎస్ అధికారుల ఉదాసీనతపై తల్లిదండ్రుల ఆవేదన
– వివరాలు వెల్లడించడంలో తీవ్ర జాప్యం
హైదరాబాద్: అమెరికాలోని మేరీల్యాండ్‌లో దారుణ హత్యకు గురైన తెలుగు యువతి నిఖిత గోడిశాల కేసులో ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత పురోగతి కనిపించింది. అర్జున్ శర్మను ఢిల్లీలో అరెస్ట్ చేసి కోర్టు కస్టడీకి అప్పగించడాన్ని ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు. అయితే, ఈ కేసులో యూఎస్ దర్యాప్తు అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని, తమ బిడ్డ మృతికి సంబంధించిన కీలక విషయాలను అధికారికంగా చెప్పకుండా దాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిఖిత హత్య కేవలం ప్రేమ వ్యవహారం కాదని, ఆర్థిక లావాదేవీల కోణంలోనూ సమగ్ర విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
కుమార్తె మృతికి సంబంధించిన కీలక వివరాలను కేసును దర్యాప్తు చేస్తున్న అధికారుల నుంచి కాకుండా, మీడియా ద్వారా తెలుసుకోవాల్సి రావడం విచారకరమన్నారు. న్యాయం కోసం అడుగుతున్నాం తప్ప ఎవరితోనూ ఘర్షణ పడాలని కాదని స్పష్టం చేశారు. దాదాపు 200 ఫోన్ కాల్స్ చేసిన తర్వాత భారత్, అమెరికాలోని అధికారులు, సంస్థలను ఆశ్రయించిన తర్వాత ఢిల్లీలో అర్జున్ శర్మను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారన్నారు. తదుపరి కోర్టు విచారణల ప్రకారం.. నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలు అనంతరం శర్మను అరెస్టు చేసి ఢిల్లీ కోర్టు కస్టడీకి అప్పగించారన్నారు.
ఈ అరెస్టు కేవలం ఒక చట్టపరమైన పరిణామం మాత్రమే కాదని, తమ కుమార్తెకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి రెండు దేశాలు, పలువురు అధికారులు, న్యాయ ప్రక్రియల మధ్య నెలల తరబడి సాగించిన పోరాటానికి దక్కిన విజయం అన్నారు. భారత ప్రభుత్వం, జాతీయ మానవ హక్కుల కమిషన్, తెలంగాణ పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా కమిషన్ తదితర విభాగాలను ఆశ్రయించి సహాయం కోరామని, న్యాయం కోసం తదుపరి ఎవరిని సంప్రదించాలో మార్గదర్శనం చేయాల్సిందిగా వేడుకున్నామని తెలిపారు. శర్మ బయట స్వేచ్ఛగా ఉంటే తమకు న్యాయం జరగదన్నారు. బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసే సందేశాలు కూడా వచ్చాయన్నారు. ఈ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి?, వాటి వెనుక ఉన్న పరిస్థితులు ఏమిటి?, దీనిలో ఏవైనా నేరపూరిత చర్యలు ఉన్నాయా? ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో వీటికి లింకులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరపాలని కోరారు.
మా కుమార్తెను తిరిగి తీసుకురాలేమన్నారు. న్యాయం జరగదేమోనన్న భయం వెంటాడినా వెనకడుగు వేయలేదన్నారు. అధికారుల చుట్టూ తిరిగామన్నారు. ఎక్కడా మా పోరాటాన్ని ఆపలేదన్నారు. యూఎస్ అధికారులు పారదర్శకతతో వ్యవహరించాలని, మాకు న్యాయం చేయాలని కోరారు. మేమేమీ ప్రత్యేక గుర్తింపును, ప్రత్యేక మినహాయింపులను కోరడం లేదన్నారు. తమ బిడ్డ హత్యకు గురైనప్పుడు ఏ తల్లిదండ్రులైనా కోరుకునే కనీస హక్కు అయిన ‘నిజం’ మాత్రమే మాకు కావాలన్నారు. నిఖితకు దక్కాల్సిన న్యాయం, గౌరవం దక్కేంతవరకు మా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
నిఖిత హత్యను కేవలం ఒక ప్రేమ వ్యవహారంగా మాత్రమే చిత్రీకరించడం అన్యాయమన్నారు. శర్మ 2025 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉద్యోగం కోల్పోయాడని, ఆ తర్వాత నిఖితతో పాటు కుటుంబ సభ్యుల వద్ద కూడా డబ్బులు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. నిఖితకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో ఆమె మరణానికి ముందే ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయని, అమెరికాలోని ఇతర వ్యక్తులతో కూడా శర్మకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని పేర్కొన్నారు మృతికి, ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ ద్వారా జరిగిన లావాదేవీలు, సంభాషణలు, అనుమానాస్పద కార్యకలాపాలపై భారత్, అమెరికా దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా విచారణ జరపాలని, ఆధారాల ప్రాతిపదికన వాస్తవాలను నిగ్గుతేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రచనా శర్మ ప్రవర్తనపై కూడా విచారణ జరపాలని కోరారు. శర్మ ఎక్కడ ఉన్నాడనే సమాచారం ఆమెకు తెలుసని, ఆమె ఏమైనా సహాయం అందించిందా, ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాము ఎవరినీ ముందస్తుగానే దోషులుగా నిర్ధారించాలని కోరడం లేదని, ఈ కేసులో మరెవరికైనా క్రిమినల్ బాధ్యత ఉందో లేదో కేవలం ఆధారాల ఆధారంగానే తేల్చాలని స్పష్టం చేశారు.
ఈ క్లిష్ట సమయాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, జాతీయ మానవ హక్కుల కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మహిళా కమిషన్, తెలంగాణ పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, ఎంసీఆర్ఎఫ్ ఫౌండేషన్, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అండగా నిలిచిన ఐపీఎస్ అధికారులు చారు సిన్హా, రక్షిత మూర్తిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు నిరంతరం మద్దతుగా నిలుస్తూ, సరైన మార్గదర్శనం చేస్తూ, వివిధ అధికారిక యంత్రాంగాలతో సమన్వయం చేయడంలో సహాయపడిన సామాజిక కార్యకర్తలు, శ్రీదివ్య వడ్లపూడి, డాక్టర్ గోవిందరాజులు వడ్లపూడిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అరెస్ట్ ప్రారంభం మాత్రమేనని, ముగింపు కాదని పేర్కొన్నారు. యూఎస్ అధికారులు తమతో నేరుగా, పారదర్శకంగా సంప్రదింపులు జరపాలని, బాధితురాలి రక్తసంబంధీకులకు చట్టపరంగా వెల్లడించదగిన సమాచారాన్ని అందించాలని, భారత అధికారులతో పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఆర్థిక లావాదేవీ, సంభాషణలు, సాక్షులు, ఆధారాలను పరిశీలించి, బాధ్యులను శిక్షించాలని కోరారు. తమ బిడ్డ కేసుకు సంబంధించి అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి రెండు ప్రభుత్వాలు, రెండు న్యాయ వ్యవస్థల చుట్టూ తిరుగుతూ దాదాపు 200 ఫోన్ కాల్స్ చేయాల్సి రావడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలాంటి వేదనను ఎదుర్కోకుండా ఉండాలంటే, భారత్, భాగస్వామ్య దేశాల మధ్య బాధితుల కుటుంబాలతో సమన్వయం, కమ్యూనికేషన్ యంత్రాంగం అత్యవసరమని పేర్కొన్నారు.
ry: అమెరికాలోని మేరీల్యాండ్‌లో 2025 డిసెంబర్ 31న నిఖిత గోడిశాల హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా, తమ కుమార్తె మృతికి గల కారణాలు, దర్యాప్తు పురోగతిపై స్పష్టమైన సమాచారం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. నిఖిత మృతదేహం సూట్‌కేసులో లభ్యమైందన్న తీవ్ర దిగ్భ్రాంతికర విషయాన్ని అధికారులు ఎప్పుడూ చెప్పలేదని, మీడియా కథనాల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. పదేపదే ఈమెయిళ్లు పంపినా, సంప్రదించే ప్రయత్నాలు చేసినా యూఎస్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. భారతీయ, అమెరికన్ తెలుగు సంఘాలు, ప్రజాప్రతినిధుల చొరవతో 2026 జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో జరిగిన సంభాషణే అధికారులతో చివరి ముఖ్యమైన సమన్వయమని పేర్కొన్నారు. (Story: అమెరికాలో నిఖిత హత్య కేసులో పురోగతి)
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
- నవ్వులే నవ్వులు! నయనం టీమ్‌తో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

