వేడుకగా గీతమ్స్ బ్లూమ్స్ పాఠశాల స్నాతకోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : గీతమ్స్ బ్లూమ్స్ పాఠశాల 17 వ స్నాతకోత్సవ వేడుకలు స్థానిక నరసరావుపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రూల్లా, గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు గుండాల స్వెనోమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిధుల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ. విద్యార్థిని, విద్యార్థులు బాల్యం నుండే చదువుపై దృష్టి సారించి శ్రద్ధగా చదవాలని తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థినీ విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్, సినిమాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. అవసరానికి అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవాలే తప్ప వాటికి బానిసలు కారాదన్నారు. సెల్ ఫోన్ వల్ల విద్యార్థులు మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రభావితమవుతున్నారన్నారు. సెల్ ఫోన్ అతిగా వాడకం వల్ల కంటి సంబంధిత వ్యాధులు, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువన్నారు. అందుకే వాటికి దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రిన్సిపల్ కె. శ్రీనివాస రాజు, రవీంద్ర సుభాని, పాఠశాల డైరెక్టర్ నారాయణ, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.(Story : వేడుకగా గీతమ్స్ బ్లూమ్స్ పాఠశాల స్నాతకోత్సవ వేడుకలు)
