వినుకొండ చెక్‌పోస్ట్ సెంటర్‌లో బహిరంగ డ్రైనేజీ ప్రమాదం — మూతలు వేయాలని సిపిఐ డిమాండ్
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక మార్కాపురం రోడ్డులో ఉన్న చెక్‌పోస్ట్ సెంటర్ వద్ద ప్రధాన డ్రైనేజీ కాలువ బహిరంగంగా ఉండటం ప్రజలకు ప్రాణాపాయం కలిగిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం సిపిఐ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించి పరిస్థితిని అంచనా వేసింది. మున్సిపాలిటీ అధికారులు ఇటీవల డ్రైనేజీ పూడికలు తొలగించినప్పటికీ, కాలువపై రక్షణ మూతలు ఏర్పాటు చేయకపోవడంతో నివాసితులు మరియు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు అడుగుల వెడల్పు, ఐదు అడుగుల లోతు ఉన్న ఈ కాలువను దాటకుండా మార్గం లేకపోవడంతో ప్రజలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. స్థానికులు అధికారులను సంప్రదించగా “మూతలు మీరే వేసుకోవాలి” అని సమాధానం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. దీనిపై స్పందించిన సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మంచిదే కానీ ప్రజల రాకపోకల భద్రతను కూడా మున్సిపాలిటీ బాధ్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. కాలువ దాటే సమయంలో కాలుజారి పడితే తీవ్ర గాయాలు లేదా ప్రమాదాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని, రోడ్డుపై ప్రవహించే వర్షపు నీటితో డ్రైనేజీ కనిపించకుండా పోతుందని, కొత్తగా వచ్చే వాహనదారులు లేదా పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. జననివాస ప్రాంతంలో ఉన్న ఈ డ్రైనేజీపై తక్షణమే మూతలు ఏర్పాటు చేయాలని, లేకపోతే జరిగే ప్రమాదాలకు మున్సిపాలిటీ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని రాము హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిపిఐ నాయకులు చీరాల అంజయ్య, షేక్ మస్తాన్, ఎస్.కె.కిషోర్, షేక్ నజీర్, దుర్గారెడ్డి, తోట నరసింహారావు, బొట్టు శీను, షేక్ నాగూర్, నర్రా వెంకటరత్నం, బ్రహ్మేంద్ర, షేక్ సుభాని తదితరులు మరియు స్థానిక బాధితులు పాల్గొన్నారు.(Story :వినుకొండ చెక్‌పోస్ట్ సెంటర్‌లో బహిరంగ డ్రైనేజీ ప్రమాదం — మూతలు వేయాలని సిపిఐ డిమాండ్ )

