తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆదేశం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ స్క్రీన్ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని నీటి సరఫరా మెరుగుదలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద 29 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా 186 కోట్ల రూపాయల యుఐడిఎఫ్ నిధులకు సంబంధించి మరో 10 రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన టెండర్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జీవి అధికారులకు సూచించారు. అన్ని అనుమతులు త్వరితగతిన పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. వినుకొండ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story:తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం)

