చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
న్యూస్ తెలుగు/చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం మరియు మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రత్న మాణిక్యం మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలే కాకుండా ఆమె గొప్ప సంఘసంస్కర్త మరియు కవయిత్రి అని, 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి మహిళల, అట్టడుగు వర్గాల విద్య, సామాజిక హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం శేఖర్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే, పితృస్వామ్యం, బాల్యవివాహాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ఎస్ అప్పనమ్మ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే తన భర్త జ్యోతిరావు ఫూలే తో కలిసి సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి కులాంతర వివాహాలను ప్రోత్సహించారని, మహిళల కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. తెలుగు విభాగాధిపతి కె లక్ష్మీ ప్రసన్నకుమారి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళల కోసం, అనాధల కోసం శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేశారని మహిళా సేవా మండల్ స్థాపించి లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో, జి హారతి, నాగమోహన్ రావు, కె శైలజ, జి సాయికుమార్, బి శ్రీనివాసరావు, ఎన్ ఆనంద్, కె కీర్తి, ఆర్ కిరణ్మయి తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి )

