దివ్యాంగులు పట్టుదలతో లక్ష్యాలను సాదిస్తూ స్ఫూర్తి దాయకంగా ఉంటూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : వైకల్యం అనేది శరీరానికి మాత్రమే కానీ తాము అనుకున్న లక్ష్యాల సాధనకు కాదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగులకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా క్రీడల్లో రాణించిన విజేతలకు బహుమతులను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు చాలా పట్టుదల మంచి స్ఫూర్తి ఉంటుందని దానివల్లనే సకలాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలియజేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వాస్తవంగా డిసెంబర్ 3న నిర్వహించుకోవాల్సి ఉందని కానీ ఎన్నికల ప్రవర్తన నియమాలు దృష్ట్యా ఈరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి జనవరి 2026 మాసంలో ఏదో ఒక రోజు ప్రత్యేకంగా దివ్యాంగులకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందనీ తెలియజేశారు. త్వరలోనే ప్రత్యేక ప్రజావాణి తేదీని తెలియజేస్తామని చెప్పారు. దివ్యాంగుల కమిటి వారి సమస్యల పట్ల ఇచ్చిన సూచనలు ప్రభుత్వం దృష్టికీ తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దివ్యాంగులు తన వైకల్యాన్ని అధిగమించి అన్ని రంగాల్లో రాణిస్తూ స్పూర్తిదాయకంగా ఉంటూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, అడిషనల్ డిఆర్డీఒ సరోజ, మానసిక వైద్యులు డా పుష్ప, తహసిల్దార్ రమేష్ రెడ్డి , సి.డి.పి. ఒ లు, సూపర్వైజర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.(Story : దివ్యాంగులు పట్టుదలతో లక్ష్యాలను సాదిస్తూ స్ఫూర్తి దాయకంగా ఉంటూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి )

