డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం విచ్చేసి, విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవుడు స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి మానవ హక్కులు ఊతమిస్తాయన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్షకు గురికాకుండా సమాన హక్కులతో జీవించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1948 డిసెంబర్ 10 న పారిస్ వేదికగా ప్రపంచంలోని దేశాలన్నీ ఓ ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుండి డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ఎస్. అప్పనమ్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఆరు ప్రాథమిక హక్కులను ప్రసాదించడం జరిగిందన్నారు. ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డా. వై. పద్మ, డా. కె. శకుంతల, జి. హారతి, కే. శైలజ, ఆర్. మౌనిక, బి. శ్రీనివాస్ రావు, ఎన్. ఆనంద్, కె. కీర్తి, ఆర్. కిరణ్మయి తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం )

