రెవిన్యూ సేవలు ప్రజలకు చేరువ చేస్తున్న ప్రభుత్వం
భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దరమే ప్రభుత్వ లక్ష్యం
రూ.100 కే వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వం
నియోజకవర్గంలో అగ్రహారం, ఇనామ్ భూ సమస్యను పరిష్కరించాలి.
రెవిన్యూ అధికారులను ఆదేశించిన చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలోని చిన్న సన్న కారు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా 10 లక్షలు లోపు వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కేవలం రూ.100 కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఆర్డీవో కే మధులత అధ్యక్షతన మంగళవారం జరిగిన రెవిన్యూ సమీక్ష సమావేశానికి చీఫ్ విప్ జీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దరమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. రెవిన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువచేసే దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తుందన్నారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీ సర్వే పూర్తిచేసే విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజవర్గంలో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా 22(ఏ) లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని, గ్రీవెన్స్ లో ప్రజల నుండి వచ్చిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న అగ్రహారం, ఇనాం భూములను వెంటనే సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇనాం భూముల సమస్యలను 2026 జనవరి నుండి మార్చి లోపు పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం పని చేసి ఆయా రైతులకు హక్కులు కల్పించాలని తెలిపారు. భూములు రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే జాప్యం లేకుండా ఆటోమేటిక్గా ముటేషన్ పూర్తి చేయాలని, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర సేవలకు ప్రజలను కార్యాలు చుట్టూ తిప్పుకోకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా రెవెన్యూ అధికారులు భూ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం నిబంధన అతిక్రమించిన అక్రమాలకు పాల్పడిన అటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, తాసిల్దార్ లు, కూటమి నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.(Story : రెవిన్యూ సేవలు ప్రజలకు చేరువ చేస్తున్న ప్రభుత్వం )

