పెద్దమందడి చెరువుకు శంకరసముద్రం నుండి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించి తీరుతా
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగత్ప ల్లి,మనిగిల్ల,పెద్దమందడి,అల్వాల,మోజర్ల తదితర గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు సుఖేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,స్వాతి,రాజవర్ధన్ రెడ్డిల తరుపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పెద్దమందడి రైతాంగాన్ని ఆదుకోవాలని బుద్దారం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు నీరు అందించామని కానీ నీటి సరఫరా సకాలములో అందడం లేదని యాసంగి వచ్చేవరకు చెరువు ఎండిపోతుందని నిపుణుల ద్వారా అంచనా వేయించి శంకర సముద్రం నుండి ఎత్తిపోతల పథకం రూపొందించి రైతుల కష్టాలు తీర్చాలని భావించామని అంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం వల్ల సాధ్యం కాలేదని అయినా పెద్దమందడి సర్పంచిగా స్వాతిని గెలిపిస్తే ఎత్తి పోతల పథకం సాధిస్తా అని రైతాంగ వెతలు తీరుస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని నమ్మవద్దు అని మాకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్నారని రెండేండ్లు ఏమి పీకలేనివారు ఇప్పుడు ఏమి అభివృద్ధి చేస్తారని నిలదీయాలని పిలుపునిచ్చారు.గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి వల్ల ఏమి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలకు శూన్యహస్తం చూపిందని ఎద్దేవ చేశారు. రైతులకు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిందని,బోనస్ నేటికి 1154కోట్లు రైతులకు బకాయి పడ్డదని రైతు రుణ మాఫీకి దిక్కులేదని ఘాటుగా విమర్శించారు. కె.సి.ఆర్ 46వేల చెరువులు దురాస్తు చేసి,10వేల కోట్లు కరెంటుకు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసి 50లక్షల కోట్ల సంపద సృష్టించారని కొనియాడారు. రేవంత్ రెడ్డి వచ్చిన రెండేండ్లలో 2లక్షల 60వేల కోట్లు అప్పు చేసి ఏమి ఎలగబెట్టారని దుయ్యబట్టారు. ఇక్కడి నాయకులు సొంత మండలం అని చెప్పి 10ఏండ్లలో చేయని అభివృద్ధి 2ఏండ్లలో చేస్తామని ఒక్క తట్టమట్టి కూడా తీయలేదని అడ్డం పొడుగు మాట్లాడడం తప్పా చేసింది ఏమి లేదని హేళన చేశారు. నియోజకవర్గంలో జిల్లా కలెక్టరేట్ తేవడం ద్వారా పరిపాలన సౌలభ్యం జరిగిందని మాత శిశు సంరక్షణ కేంద్రం ద్వారా వేలాది మంది పురుడుపోసుకొని రూపాయి ఖర్చు లేకుండా కె.సి ఆర్ కిట్టుతో సంతోషంగా ఇంటికి వెళ్ళేవారని నేడు వసతులు లేక ప్రైవేటు ఆసుపత్రులు ఆశ్రయించి నిలువు దోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో పచ్చదనం..పరిశుభ్రత కోసం కొత్తగా కార్మికులను నియమించి,కొత్త ట్రాక్టర్,ట్రాలీ ఏర్పాటు చేసి చెత్త సేకరించి పరిశుభ్రంగా ఉంచామని పచ్చదనం కోసం మొక్కలు నాటి పార్కులు ఏర్పాటు చేశామని,వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశామని పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నది అని అన్నారు. కార్మికులకు జీతాలు లేక, ట్రాక్టరుకు డీజిల్ పోసే దిక్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని ఘాటుగా విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళకు 2500,ఆసరా పింఛన్లు 4000,తులం బంగారం,గ్యాస్ సబ్సిడీ,రైతులకు రైతు భరోసా,రైతు కూలీలకు రైతు భరోసా,ధాన్యానికి బోనస్,విద్యార్థినులకు స్కూటీలు,నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు,కె. సి.ఆర్ కిట్టు, కంటివెలుగు పథకాలు ఏమైనాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమని కె.సి.ఆర్ సుపరిపాలన,గ్రామాల అభివృద్ధి జరగాలంటే బి. ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమములో గట్టు యాదవ్,జగదీశ్వర్ రెడ్డి,పలుస.రమేష్ గౌడ్,నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి, బండారు.కృష్ణ,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,గులాం ఖాదర్ ఖాన్,ఇమ్రాన్,అరీఫ్,మంద.రాము,అనిపాటి.రాము,అలీమ్,తదితరులు పాల్గొన్నారు.(Story :పెద్దమందడి చెరువుకు శంకరసముద్రం నుండి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించి తీరుతా )

