వినుకొండలో దౌర్జన్య పాలన సాగుతున్నది బొల్లా
న్యూస్ తెలుగు/వినుకొండ : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి వినుకొండలో అస్తవ్యస్త అరాచక పాలన సాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదివారం విలేకరుల సమావేశంలో ఆవేశ భరితంగా మాట్లాడారు. కల్తీ ఎరువులు, నకిలీ ఎరువులు, వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ అధినాయకులు ఇద్దరు నోరు మెదపడం లేదని, అలాగే భూ ఆక్రమణలు మితిమీరి పోయాయని, నిబంధనలకు అనుగుణంగా అన్ని పత్రాల ఉన్నప్పటికీ రాత్రులందు భూముల్లో చొరబడి గోడలు కడుతున్నారని, ఈ అరాచకాన్ని తాము అడ్డుకుంటామని, అవసరమైతే తాను జైలుకైనా వెళ్తానని బొల్లా అన్నారు. డీఏపీ ఎరువు 1800 రూపాయలు దాటిన చీఫ్ విప్ గా ఉన్న ఎమ్మెల్యే జీవి నోరు మెదపకుండా అధికారులకు, వ్యాపారస్తులకు చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. విచ్చలవిడిగా ఆర్టీసీ కార్గో పార్సిల్స్ లో నకిలీ పురుగుమందులు వస్తూ అధికారులు పట్టుకున్నప్పటికీ, ఎమ్మెల్యే దాని గురించి ఆరా తీయలేకపోయారని ఘాటుగా విమర్శించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గత వైసిపి హయాంలో రైతుల మేలు కోసం మట్టి నమూనా సేకరించేందుకు మూడు కోట్లతో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ల్యాబ్ ను ఇప్పుడు ఖాళీగా ఉంచి అధికారులు కూర్చుంటున్నారని బ్రహ్మనాయుడు విమర్శించారు. ఇక నియోజకవర్గంలో ప్రధాన చెరువులన్నింటినీ మరో ప్రజా నేత తన హస్తగతం చేసుకొని బినామీ పేర్లతో చేపల చెరువులుగా మారుస్తూ సొమ్ము చేసు కుంటున్నారన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పిస్తామని బొల్లా ఆగ్రహించారు.(Story : వినుకొండలో దౌర్జన్య పాలన సాగుతున్నది బొల్లా )

