ఎన్టీఆర్ ఇల్లు, ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు చేయించండి
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన – ఎన్టీఆర్ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగుస్తుందని వినుకొండ నియోజకవర్గంలోని టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు అర్హులైన ప్రతి ఒక్క పేదవానితో దరఖాస్తులు చేయించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం “అందరికీ ఇల్లు” పథకాన్ని అమలు చేసి సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివేషణ స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు. సొంత ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 2.50 లక్షల వరకు ప్రభుత్వం సాయం అందిస్తుందని, అర్హులైన పేదలు గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రేషన్ కార్డు లేని వారు కూడా నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసేందుకు సచివాలయాలకు వెళ్లిన సమయంలో దరఖాస్తు ఆన్లైన్ నమోదు చేయమని ఎవరైనా సచివాలయ సిబ్బంది నిరాకరిస్తే వెంటనే తమ దృష్టికి, లేదా చీఫ్ విప్ కార్యాలయం సిబ్బంది దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకొని పెట్టిన దరఖాస్తు నమోదు చేయించడం జరుగుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కోరారు.(Story:ఎన్టీఆర్ ఇల్లు, ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు చేయించండి)
