Homeవార్తలుతెలంగాణరైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి

రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి

రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి

మంత్రి జూపల్లి కృష్ణారావు

న్యూస్‌తెలుగు/వనపర్తి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇబ్బందులు కల్పించకుండా కొనుగోలు చేసి డబ్బులు త్వరగా అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
గురువారం ఉదయం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి వరి కొనుగోలు పై ఐ.కే.పి., సహకార సంఘం కొనుగోలు కేంద్రాల యజమానులు, రైస్ మిల్లర్లు, ఎపియం లతో సమీక్ష నిర్వహించారు. రైతులు వడ్లు కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చినప్పుడు 17 శాతం తేమ శాతం , తాలు, మట్టి లేకుండా చూసుకొని తూకం చేసి అక్కడే రైతుకు రషీదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదని, రైతులు రైస్ మిల్లు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నుండి వడ్లు కొన్న వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి రైతుకు రసీదు ఇవ్వాలనీ, ట్యాబ్ ఎంట్రీ చేయకుండా వడ్లు లారీ ఎక్కించవద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు రానున్న దాదాపు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను తరలించడానికి 350 లారీలు అవసరం అవుతాయి, కానీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో లారీలు పెట్టకపోవడం వల్ల, రైస్ మిల్లులో వడ్లు సకాలంలో దించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంచి పైన 2 శాతం, తేమ పైన మరో రెండు శాతం అదనంగా తూకం తీసుకుంటున్న మిల్లర్లు మిల్లుకు వచ్చిన ధాన్యం నుండి ఒక్క కిలో కూడా తరుగు తీయడానికి వీలు లేదని హెచ్చరించారు.
ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రభుత్వ అధికారిని నియమించాలని, అదేవిధంగా కొనుగోలు కేంద్రానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్య ఎక్కడ వచ్చిన తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వనపర్తి జిల్లాలో 2020-21 నుండి మిల్లర్లు దాదాపు 400 కోట్ల రూపాయల ధాన్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని, వాటిని వెంటనే అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సూచించారు. ధాన్యం ఇవ్వని మిల్లుల పై రెవెన్యూ రికవరి యాక్టు ప్రయోగించాలని సూచించారు. మిల్లర్లు తమ సూపర్వైజర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలకే వెళ్లి తేమ శాతం చూసుకోవాలని, రైతులకు తేమ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వివరిస్తూ వనపర్తి జిల్లాలో వానకాలం వరి ధాన్యం దాదాపు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని, అందులో నుంచి దాదాపు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో మొత్తం 396 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేసి ఇప్పటి వరకు 330 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కొల్లాపూర్ ప్రాంతంలో వరి కోతలు ఆలస్యంగా ప్రారంభంచినందున మిగిలిన కొనుగోలు కేంద్రాలు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 33 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని ఇందులో ఇప్పటివరకు 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ట్యాబ్ లో ఎంట్రీ చేసినట్లు తెలిపారు.
వనపర్తి జిల్లాలో మొత్తం 173 రైస్ మిల్లులు ఉండగా ఈ సంవత్సరం 81 మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు అనుమతించడం జరిగిందన్నారు. మిగిలిన మిల్లులు సకాలంలో ధాన్యం అప్పగించనందున ధాన్యం కేటాయించడంలేదని, 39 మిల్లులపై కేసులు సైతం నమోదు చేసినట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. మిల్లుకు ధాన్యం కేటాయించాలంటే ముందుగా కనీసం 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని కానీ ఇప్పటివరకు కేవలం 46 మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీ ఇచ్చినట్లు చెప్పారు.
స్పందించిన స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మిగతా రాష్ట్రాల్లో మిల్లర్లు వంద శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారని, ఇక్కడ కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి ఇబ్బందులు ఏమున్నాయని మిల్లర్లను ప్రశ్నించారు. వెంటనే మిల్లర్లు అందరూ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ధాన్యం దించుకోవాలి, ఇతర జిల్లాకు ధాన్యం వెళ్లకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రం నుండి తరలించడం లేదని రైతులు తన దృష్టికి తెచ్చారని, కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు యుద్ధప్రాతిపదికన మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తేమ కొలిచే యంత్రాలలో వ్యత్యాసాలు ఉన్నాయని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు మంత్రి దృష్టికి తీసుకురాగా అవసరమైతే ఒకే రకమైన తేమ కొలిచే యంత్రాలు కొని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, మిల్లర్లకు అందజేసి వారి నుండి డబ్బులు వసూలు చేసుకోవాలని కలెక్టర్ ను సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ బి. శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఎపీఎం లు, ఎ ఈ ఓ లు, తదితరులు పాల్గొన్నారు. (Story:రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!