అన్నదాత మదుపులకు రూ. 20వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం
రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన మంత్రి
జిల్లాలో 1,22,260 మంది రైతుల ఖాతాల్లో రూ.83.32 కోట్లు జమ
సాలూరు నియోజకవర్గంలో 31,531 మంది లబ్ధిదారులకు గాను రూ. 21.37 కోట్లు విడుదల
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
న్యూస్ తెలుగు/సాలూరు : అన్నదాత మదుపుల కొరకు ఆలోచన చేసి ఏటా రూ. 20వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.బుధవారం పాచిపెంట మండలంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ బటన్ నొక్కగానే ఇక్కడ రైతుల ఖాతాలలో డబ్బులు పడిపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే డబ్బులు పడిపోవడం అదే కూటమి ప్రభుత్వమని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ₹20,000 ఇస్తామని ప్రకటించడం జరిగిందని, అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ₹7,000 రూపాయలు వేసుకున్నామని గుర్తుచేశారు. ఈ రోజు మరలా రెండో విడత కింద ₹7,000 వేసుకుంటున్నట్లు చెప్పారు. మరో మూడు మాసాల్లో మళ్ళీ ₹6,000 మూడో విడత అందజేసి, మొత్తంగా. ₹20,000 రూపాయల్ని అన్నదాతకు మదుపుల నిమిత్తం అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇదని పేర్కొన్నారు. రైతులందరికీ మదుపులకు డబ్బులు కావాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు పడితే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో నిన్న మనం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. 24 గంటల్లో డబ్బులు పడతాయంటే, కేవలం రెండు గంటలు మూడు గంటల్లోనే ఖాతాల్లో పడినటువంటి రైతులు కూడా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రతి నీటి ప్రాజెక్టులో కూడా చేప పిల్లలు వేసుకోవడానికి రెడీ చేసుకున్నామని, . నిన్ననే వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులో 4 లక్షల చేప పిల్లలు వేసుకోవడం కూడా జరిగిందని తెలిపారు.
సాలూరు నియోజకవర్గంలోని మక్కువలో 7,500 మందికి ఈ రోజు అకౌంట్ లో డబ్బులు పడ్డాయని, సాలూరు మండలం, టౌన్ కలిపి దాదాపు 11, 078 మందికి డబ్బులు పడినట్లు చెప్పారు. పాచిపెంటలో 5,881 మందికి, అలాగే మెంటాడలో 7,280 మందికి డబ్బులు పడ్డాయని, మొత్తంగా సాలూరు నియోజకవర్గంలో 31,531 మందికి ఈ రోజు డబ్బులు జమ కాబడినట్లు మంత్రి వివరించారు. ఇంతమంది రైతుల ఇళ్లల్లో ఈ రోజు దీపం వెలుగుతుందని, కుటుంబాల్లో ఆనందం ఉంటుందన్నారు. ఈ రోజు మొత్తంగా 22 కోట్ల రూపాయలు కేవలం మన సాలూరు నియోజకవర్గంలో డబ్బులు జమకాబడిన విషయాన్ని ప్రస్తావించారు. పాలకొండ నియోజక వర్గంలో 33 వేల మంది, కురుపాం నియోజక వర్గంలో 39 వేల మంది, పార్వతీపురం నియోజక వర్గంలో 26 వేల మంది, సాలూరు నియోజక వర్గంలో 31,500 మంది వెరసి 83.32 కోట్లు జిల్లాలో జమ అయినట్లు మంత్రి తేల్చిచెప్పారు.
జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే మొదటి విడత నిధులు జమకాబడ్డాయని, రెండో విడత నిధులు కూడా కొందరి రైతుల ఖాతాల్లో నిధులు జమ కాబడటంతో రైతుల కుటుంబాల్లో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, ప్రతీ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధరను పొందాలని సూచించారు. పంటలకు, పచ్చదనానికి, సహజసిద్ధంకు మారుపేరుగా ఉండే ఈ జిల్లాలో ఒకే పంటను వేయడం వలన రైతులు నష్టపోతున్నారని అన్నారు..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా, డిఏపిల వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని గుర్తుచేశారు.
జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, వాటిని ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దళారీల మాటలు విని మోసపోవద్దని, రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. తద్వారా రైతులు గిట్టుబాటు ధరను పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్ పాల్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.(Story : అన్నదాత మదుపులకు రూ. 20వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం )
