క్రీడా రిజర్వేషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
*అంతర్ జిల్లాస్థాయి బాలుర, బాలికల కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన జీవి..
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాల్లో 2 నుంచి 3%కి పెంచిన క్రీడా రిజర్వేషన్లను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయిలో ఆటల పట్ల ఆసక్తి పెంచుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం, గౌరవ మర్యాదలతో పాటు భవిష్యత్‌లో ఉజ్వల అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులుగా క్రీడల్లో రాణించే వారు జీవితంలో కూడా ఉన్నతస్థాయికి చేరుకుం టారని తెలిపారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 69వ అంతర్ జిల్లాస్థాయి బాలుర, బాలికల కబడ్డీ టోర్నమెంట్ క్రీడా సంబరాన్ని శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. కాసేపు కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర రేపటితరాన్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నారు. వైకాపా హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని , కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ ద్వారా 16, 400 పోస్టుల నియామకాలు చేపట్టామని, పీఈటీల ఖాళీలన్నీ నింపడం జరిగిందన్నారు. ఒకవైపు టీచర్ పోస్టుల భర్తీ, మరోవైపు మౌలిక వసతుల పెంపు ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేదపిల్లల్ని దేశం గర్వించేలా తీర్చి దిద్దాలనే మంత్రి లోకేష్ సంకల్పంగా పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం పడుతున్న కష్టాన్ని ప్రజలు అందరు కూడా అభినందిస్తున్నారు. తాను కూడా చిన్నప్పుడు కబడ్డీ క్రీడాకారుడిని అని, అప్పట్లో జోన్ వరకు ఆడినట్లు తెలిపారు. బంగారు పతకం సాధించిన గద్దె హరీష్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో చక్కగా ఆడాలని, గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకోవాలని సూచించారు. ఓటముల్ని గెలుపునకు నాందిగా చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రా అని కోట్లకు కోట్లు దోపిడీ చేశారని, ఎక్కడా మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పీఈటీలను నియమించకపోవడమే కాకుండా ఆడుదాం ఆంధ్రా నిధులు దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. విద్యార్థులంతా ఆంధ్రప్రదేశ్ తరఫులన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, బంగారు పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, క్రీడా సంఘాలు, విద్యార్థులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story:క్రీడా రిజర్వేషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి)

