చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిర్సా ముండా 150వ జయంతి
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని “జన్ జాతీయ గౌరవ దివాస్” శనివారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. రత్న మాణిక్యం తెలియజేశారు. తొలుత బిర్సా ముండా చిత్రపటానికి ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన ఉద్యమ నాయకుడు చిన్న వయస్సులోనే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన బిర్సా ముండా సేవలను కొనియాడారు. గిరిజన సమస్యలను తన సమస్యలుగా భావించి వారిని చైతన్యపరచి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎమ్.శేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో సమర శంఖం పూరించిన ఆదివాసీల ఆరాధ్య నాయకుడు బిర్సా ముండా చరిత్ర ప్రధాన ఘట్టమన్నారు. 25 సంవత్సరాలు నిండకముందే తన జీవితాన్ని గిరిజన ప్రజల కొరకు త్యాగం చేసిన మహానీయుడు, భగవాన్ బిర్సా ముండా అన్నారు. ఈ కార్యక్రమంలో చరిత్ర విభాగాధిపతి, బి.శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి. సాయికుమార్, డాక్టర్ వై. పద్మ, జి. వెంకటరావు, ఆర్.మౌనిక, ఎన్.ఆనంద్, కేఎల్.ప్రసన్నకుమారి, కె. కీర్తి, కిరణ్మయి, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.(Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిర్సా ముండా 150వ జయంతి)

