మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నంబావి మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని వ్యవసాయ అధికారులను ఆరా తీయగా 9500 ఎకరాల్లో సాగు చేసినట్లు బదులిచ్చారు. అనంతరం ఓ రైతు తెచ్చిన మొక్కజొన్న పంట ధాన్యం లో తేమను స్వయంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు రైతులు మాట్లాడుతూ తమకు మొక్కజొన్న పంటను విక్రయించేందుకు చిన్నంబావిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం దూరం అయిందని, అయ్యవారిపల్లిలో మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రైతుల విజ్ఞప్తిని సంబంధిత మార్క్ఫెడ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైతే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. (Story:మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి)

