క్రీడల్లో గెలుపోటములు సహజం, రెండింటిని సమానంగా తీసుకోవాలి : జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి: క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని సమానంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండలంలోని బుద్దారం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన, జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. వీరితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, అచ్యుత్ రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి తెలకపల్లి, వెల్దండ పాఠశాలల జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ తో ఆటల పోటీలను ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ ఆటల పోటీల్లో వనపర్తి జిల్లా నుంచి గోపాల్పేట, పెద్దమందడి, కొత్తకోట, నాగర్ కర్నూల్ జిల్లా నుంచి కొల్లాపూర్, తెలకపల్లి, వెల్దండ, మన్ననూరు పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. జోనల్ స్థాయిలో గెలిచిన చెట్లు రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపిక కానున్నాయి.
అంతకుముందు కార్యక్రమంలో చిన్నారెడ్డి ప్రసంగిస్తూ వనపర్తి కేవలం వనాలపర్తి మాత్రమే కాదని ఇది ఆటలపర్తి కూడా అని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని విద్యార్థులు సమానంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మీరు కూడా ఆత్మవిశ్వాసంతో చదువుతోపాటు క్రీడల్లో కూడా అత్యున్నతంగా రాణించాలని తెలియజేశారు. ఇటీవల భారత మహిళల జట్టు క్రికెట్ ఆటలో ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న విషయాన్ని విద్యార్థినులకు గుర్తు చేశారు.(Story:క్రీడల్లో గెలుపోటములు సహజం, రెండింటిని సమానంగా తీసుకోవాలి : జిల్లెల చిన్నారెడ్డి)

