దుర్గమ్మను దర్శించుకున్న జీవీ
వేదాశ్వీరచనాలు, తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు
న్యూస్ తెలుగు /వినుకొండ : మూలనక్షత్రం సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. సోమవారం ఆలయానికి చేరుకున్న చీఫ్ విప్ జీవీకి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మాట్లాడిన ఆయన గతంలో ఎన్నడూ లేనివిధం గా ఈసారి దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున
దర్శనభాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి యజ్ఞం నిర్విఘ్నంగా ముందుకు సాగాలని, పోలవరం, అమరావతి త్వరితగతిన పూర్తి కావాలని, పెట్టుబడులు, పరిశ్రమలతో యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాలని అమ్మవారిని ఈ సందర్భంగా మొక్కుకున్నట్లు తెలిపారు. పెద్దఎత్తున తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం, పోలీసులు చేసిన ఏర్పాట్లతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందు లు లేకుండా శీఘ్రగతిన దర్శనాలు జరగడం ఆనందంగా అనిపించిందన్నారు. (Story:దుర్గమ్మను దర్శించుకున్న జీవీ )

