మద్యం స్కామ్, ప్రాజెక్టులపై మాట్లాడలేకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు
ఐదేళ్ల వైసీపీ పాలనలో దోపిడీ తప్ప సాగునీటి ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదు
శాసనసభ సమావేశాల్లో ధ్వజమెత్తిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : మద్యం కుంభకోణం, ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంపై సమాధానాలు లేకనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని మళ్లించి ప్రతిఎకరాకు నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకుంటే దానిపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని, గతంలోనూ వాళ్లు ఇలా నే కేసీఆర్‌తో కుమ్మక్కై ప్రాజెక్టుల్ని అడ్డుకున్నారని మండిపడ్డారాయన. శుక్రవారం ఈ సందర్బంగా అసెంబ్లీలో మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయు జగన్ సభకు హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టారు. అలానే అయిదేళ్ల వైకాపా పాలనలో సాగు నీటి ప్రాజెక్టులకు చేసిన నష్టాన్ని గణాంకాలతో సహా వివరించారు. 2014-19 మధ్య గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరిగేషన్‌పై 79వేల 742కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆ అయిదేళ్లలో 7 లక్షల కోట్ల బడ్జెట్‌లో అధికభాగం సాగునీటి రంగానికి ఇచ్చామని 11.4శాతం ప్రాజెక్టుల మీద ఖర్చు చేసినట్లు తెలిపారు. వైకాపా పాలనలో 12లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని ప్రాజెక్టులకు 22వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అయిదేళ్ల బడ్జెట్‌లో కేవలం 1.9% ప్రాజెక్టులకు ఇవ్వడం బట్టే రైతులపై వారికి ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి ఏమిటో తెలుసుకోవచ్చన్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వ లేదు. రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆ దుస్థితి మార్చేలా ఎన్డీయే ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఇప్పటికే 34వేల 724కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 5ఏళ్ల వైకాపా పాలనలో చేసిన దానికంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో చేసిన ఖర్చే ఎక్కువన్నాకు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12వేల 441 కోట్లు ఖర్చు చేస్తే జగన్ కేవలం 2 వేల కోట్లే ఖర్చు చేశారని, అది వారి అయిదేళ్ల బడ్జెట్‌లో 0.02శాతం అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు. కొన్ని ఆ బిల్లులు కూడా చెల్లించక పోతే ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించామన్నారు. అలాంటివారికి రాయలసీమ పేరెత్తడానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు అంతే చేశారని గత తెలుగుదేశం ప్రభుత్వంలో 1832 కోట్లు ఖర్చు చేస్తే, వైకాపా ప్రభుత్వం కేవలం 594కోట్లే వ్యయం చేసినట్లు తెలిపారు. పోలవరాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో 72శాతం పూర్తి చేస్తే వైకాపా ప్రభుత్వంలో 2శాతం కూడా చేయలేదని, మొదటి 15నెలలు అసలు పనులు చేయకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేయడంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని. ఆ భారం పాపం ఎవరిదని ప్రశ్నించారు. అప్పట్లో పోలవ రం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించారని, వాళ్లకు ఆ ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనే లేదన్నారు. జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోవడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. రుషికొండ విలాసాలకు ఖర్చు పెట్టిన దాంట్లో 10వ వంతు ఖర్చు చేసిన 42 ప్రాణాలు నిలిచేవని, మరమ్మతులు, నిర్వహణకు ఒక్క రూపాయి కేటాయించని ఫలితంగా పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుని పోయాయన్నారు. గ్రీజుకి కూడా పైసా ఖర్చు పెట్టని దుస్థితి ఆ అయిదేళ్లు చూశామన్నారు. అలాంటివారికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని ఎద్దేవా చేశారు. పుంగనూరులో ఆవులపల్లి రిజర్వాయర్‌కు గ్రీన్‌ట్రైబ్యునల్ అనుమతి లేకుండా వారి పార్టీ మనిషి పెద్దిరెడ్డికి 500కోట్లు దోచిపెట్టారని… ఇలా వారికున్న అధికారాన్ని కేవ లం దోపిడీకి మాత్రమే వాడారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయాలి అన్న లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గోదావరి-బొల్లాపల్లి-బనకచర్ల ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామన్నారు.(Story : మద్యం స్కామ్, ప్రాజెక్టులపై మాట్లాడలేకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు )

