అందరి సహకారం సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తా
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్.
న్యూస్ తెలుగు/విజయనగరం : జిల్లా ఎస్పీగా ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లా ఎస్పీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం తనకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించి, అందరి సహకారం, సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు. జిల్లాలో గంజాయి నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, సైబరు నేరాల నియంత్రణ, రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. జిల్లాలో గతంలో 2019 సం. ఎన్నికల నిర్వహణలో పని చేసిన అనుభవం ఉందని, ఇక్కడ పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహన ఉందని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపడతామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని, వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చూస్తామన్నారు. జిల్లా ప్రజలు, నాయకులు, సోషల్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు సహకారంతో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలను అందిస్తామని, అందుకు ప్రజలు, మీడియా ప్రతినిధులు తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు.
జిల్లాలో ఎస్పీగా బాధ్యలు స్వీకరించేందుకు విచ్చేసిన ఎఆర్ దామోదర్ కు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, లీగల్ అడ్వయిజర్ వై.పరశురాం, పలువురు డిఎస్పీలు, సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు స్వాగతం పలికి, పుష్ప గుచ్ఛాలను, పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.(Story :అందరి సహకారం సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తా )

