ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెమ్మసానికి జీవీ అభినందనలు
పెమ్మసాని నాగేశ్వరరావును సత్కరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన పెమ్మసాని నాగేశ్వరరావుకు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదివారం ఈ మేరకు పెమ్మసానిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటకు చెందిన పెమ్మసాని నాగేశ్వరరావు ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముందుగా మాట్లాడిన పెమ్మసాని నాగేశ్వరరావు తనకు పదవి రావడానికి సహకరించినందుకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సాగునీటి రంగ అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, నీటి వనరుల వినియోగం, నదుల అనుసంధానం, రైతుల కోసం మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, మరమ్మతులు, చెక్‌డ్యాంల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జీవీ ఆంజనేయులు సూచించారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికి తప్పక గుర్తింపు ఉంటుందని వరసగా లభిస్తోన్న నామినేటెడ్ పదవులే అందుకు నిదర్శనమన్నారు. ముందు వెనక కావొచ్చేమో గానీ నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడు అధిష్ఠానం సముచిత గౌరవం ఇస్తుందన్నారు. విపక్ష వైకాపా, తెలుగుదేశానికి మధ్య క్యాడర్‌లోనే స్పష్టమైన తేడాని అంతా గమనించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story :ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెమ్మసానికి జీవీ అభినందనలు )

