ప్రభుత్వాస్పత్రి వైద్యులపై జీవీ ఆగ్రహం
ఆస్పత్రిలో పనిచేయకుండా సంతకాలు పెట్టి గైర్హాజరు కావడంపై జీవీ ఆంజనేయులు ఆగ్రహం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ ప్రభుత్వాస్పత్రిలో విధులకు డుమ్మా కొట్టిన ఇద్దరు వైద్యులపై ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. కేవలం ఉదయం 10:30 గంటలకు హాజరుపట్టీలో సంతోకాలు పెట్టిన తర్వాత గైర్హాజరు అవుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడాదిగా ప్రభుత్వాస్ప త్రుల్లో సౌకర్యాలు, వైద్య సేవల మెరుగుదలకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారెవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే చీఫ్‌విప్ జీవీ శనివారం స్థానిక ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఓపీ నమోదు విభాగం వద్ద దస్త్రాలు పరిశీలించి సేవలపై అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డు రూమ్, ఎక్స్ రే, ల్యాబ్ , ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలిస్తున్న సమయంలో సంతకం చేసి అందుబాటులో లేకుండా పోయిన ఇద్దరు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచీ అనేకమంది పేషెంట్లు ఆస్పత్రిలో మంచి వైద్య సేవలు, అవసరమైన అన్ని ఔషధాలు అందుతున్నాయని తెలిపారన్నారు. గతంలో రోజుకు 20-30 మంది మాత్రమే ఓపీకి వస్తుండగా, ప్రస్తుతం రోజుకు 300-350 మంది రోగులు వస్తున్నారని, ఇది వైద్యసేవలు గణనీయంగా మెరుగుపడినదానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో చిన్న చిన్న అవసరాలకు కూడా మందులు లభించక ఎప్పుడూ కొరత పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చిన్నచిన్న వ్యాధుల నుంచి పెద్ద ఆపరేషన్ల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయగల సామర్థ్యం పెరిగిందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రధానలక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, కొత్తగా వైద్యుల నియామకాలు కూడా చేపట్టామన్నారు. ఆస్పత్రుల స్థాయిని బట్టి ఎక్కడికక్కడ కావాల్సినంత మేర ఔషధాల నిల్వలు అందుబాటులో ఉంచుతున్నా మని తెలిపారు. నిజాయితీగా పనిచేసే వైద్యులను ప్రభుత్వం ప్రశంసిస్తుందని, నిర్లక్ష్యం చూపే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. పేదల కోసం నడుస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులు ప్రేమతో, నిబద్ధతతో పనిచేసే వైద్యులు, సిబ్బందిని కావాలన్న జీవీ పనితీరులో లోపాలు ఉంటే మాత్రం సహించబో మని స్పష్టం చేశారు. (Story:విధులకు డుమ్మా కొట్టిన ప్రభుత్వాస్పత్రి వైద్యులపై చర్యలకు జీవీ సిఫార్సు)

