వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల ఏర్పాటు
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆసుపత్రిలో డ్రైనేజ్ పైప్ లైన్లు మార్చడము సిసి రోడ్లు వేయడం వంటి పనులు త్వరగా పూర్తిచేయాలని వైద్య విభాగం ఎ. ఈ ను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి మొత్తాన్ని కలియతిరిగిన కలెక్టర్ పరిసరాల పరిశుభ్రతతో పాటు దివ్యాంగులకు సదరం క్యాంపు ఏర్పాటుకు అవసరమైన గదులను అన్వేషించారు. ఆసుపత్రి వెనక భాగంలో సదరం క్యాంపు ఏర్పాటుకు గదులు సిద్ధం చేయాలని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న డయాలసిస్ సెంటరును మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ కు మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కేటరాక్ట్ సర్జరీలు ఎన్ని నిర్వహించారు అని వివరాలు అడిగారు. కంటి వైద్య ప్రొఫెసర్ డా. శ్రీధర్ వివరిస్తూ ఫిబ్రవరి, 2025 నుండి ఇప్పటి వరకు 103 మేజర్ శాస్త్ర చికిత్సలు, 113 మైనర్ సర్జరీలు నిర్వహించినట్లు వివర్శించారు. స్పందించిన కలెక్టర్ జిల్లాలో కేటరాక్ట్ సమస్యతో బాధపడుచున్న వారందరికీ శస్త్రచికిత్సలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో 19,700 మంది మధుమేహం వ్యాధితో బాధపడుచున్న వారిని గుర్తించడం జరిగిందని, మధుమేహం ఉన్న వారు కంటి సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి వారందరికీ ఇళ్ల వద్దనే రేటినోపతి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.డెంగ్యూ జ్వరాలను ఆదిలోనే గుర్తించి సరైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. జ్వరం లక్షణాలతో వచ్చే వారందరికీ రక్త పరీక్షలు నిర్వహించి డెంగ్యూ లేదా వైరల్ జ్వరాల ఎలాంటి జ్వరం ఉందో గుర్తించి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. ఈ నెలలో ఇప్పటి వరకు నిర్వహించిన రక్త పరీక్షల రిజిస్టరును కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా శ్రీనివాసులు, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. రంగా రావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఇతర ప్రొఫెసర్లు తదితరులు ఉన్నారు.(Story : వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల ఏర్పాటు )

