రాష్ట్రానికి పెను సవాల్‌గా వైకాపా వదిలి పోయిన చెత్త
87 లక్షల టన్నుల వ్యర్థాల నిర్వహణ త్వరలోనే పూర్తి
వినుకొండలో స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో వదిలిపోయిన చెత్త, వ్యర్థాలు ఇప్పటికీ సవాల్‌గా మిగలడం వారు చేసిన నష్టానికి, అరాచక, అడ్డగోలు పాలనకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. చెత్త పన్ను వేసింది కాక మొత్తం 87 లక్షల టన్నుల చెత్తను ఎక్కడికక్కడ కొండల్లా వదిలేసి పోయారని, ఏడాదిగా వాటికి పరిష్కారం చూప డానికే శ్రమించాల్సి వస్తోందన్నారు. ఉన్న ఆ చెత్త చాలదన్నట్లు నిత్యం జగన్, వైకాపానేతలు, కొన్ని దారి తప్పిన సోషల్ మీడియా ఛానెళ్లు మరింత చెత్త కుమ్మరి స్తూ, వాతావరణాన్ని, సమాజంలో సఖ్యతను, శాంతిభద్రతల్ని చెడగొట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఐదేళ్లు విషప్రచారం, అసత్యాలను ప్రచారం చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారని, అయినా గాని వారిలో మార్పు రాలేదని ఇకనైనా తీరు మార్చు కోవాలని హితవు పలికారు. వినుకొండలో శనివారం స్వచ్ఛతా ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను శుభ్రం చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం నుంచి బోసు బొమ్మ సెంటర్, పాత శివాలయం మీదుగా విద్యార్థులతో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఇందులో భాగస్వామ్యం అవుతున్న ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తేనే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారమవుతుందని తెలిపారు. ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చెత్తాచెదారం రోడ్లపై కాక ఆ బుట్టల్‌లోనే వేయాలని కోరారు. డ్రైనేజీల్లో చెత్తాచెదార వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పనికిరాని మొక్కల్ని తొలగించాలన్నారు. డ్రైనేజీలతో పాటు ప్రతి వీధి, బజారును పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మన పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించుకోగలుగుతామని వెల్లడించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన 87 లక్షల టన్నుల చెత్త వ్యర్థాల్లో 80 శాతానికి పైగా ఇప్పటికే ఎత్తివేయించారని చెప్పారు. మరో నాలుగైదు నెలల్లో ఐదేళ్లుగా పేరుకు పోయిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో చెత్త నుంచి సంపద సృష్టించే వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నామన్న జీవీ భవిష్యత్ మండల కేంద్రాల్లోనూ వాటి ని ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడి వెళ్లాలన్నా హెలీకాఫ్టర్ వాడేవారని అయినా తెరలు కట్టాల్సి వచ్చేదని. చెట్లు నరికేసే వారని గతాన్ని గుర్తు చేశారు. నాచి చెట్లు నరికే సంస్కృతి మార్చి వాతావరణ కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షకీలా దస్తగిరి , కూటమి నేతలు పివి సురేష్ బాబు, సౌదాగర్ జానీ బాషా, గంధం కోటేశ్వరరావు, బొంకూరి రోశయ్య, మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, సానిటరీ అధికారి ఎస్ కే ఇస్మాయిల్, మున్సిపల్ కార్మికులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.(Story : రాష్ట్రానికి పెను సవాల్‌గా వైకాపా వదిలి పోయిన చెత్త )
