అధికారులు ప్రజలను తిప్పకుండా పనులు పూర్తి చేయాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించిన జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : నియోజకవర్గంలోని ఏ విభాగం అధికారులు అయినా తమ వద్దకు సమస్యలతో వచ్చే ప్రజల్ని మళ్లీమళ్లీ తిప్పించుకోకుండా పనులు పూర్తిచేయాలని, అప్పుడే వారిపై పెట్టుకున్న నమ్మకానికి అర్థం ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతి సమస్య అధికారులు, ఉద్యోగులు వీలైనంత వరకు స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపడం అవసరమని స్పష్టం చేశారు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు నేరుగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యల ను శ్రద్ధగా విని వారికి అండగా ఉంటామని, పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్, రెవెన్యూ, తాగునీటి సహా వివిధ సమస్యలపై 48 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా చీఫ్‌విప్ జీవీ మాట్లాడుతూ. అధికారులు ప్రజలతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించుకోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందించడం వారి ప్రాథమిక బాధ్యతని గుర్తించాలని స్పష్టం చేశారు . ప్రజాదర్భార్‌కు వచ్చే అర్జీలపై తమ కార్యాలయం నుంచి కూడా ట్రాకింగ్ ఉంటుందని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో చేయాల్సిన పనులపై సమీక్షలు కూడా నిర్వహిస్తునే ఉంటామన్నా రు. అది గుర్తు పెట్టుకుని పనిచేస్తే వ్యక్తిగతంగా అధికారులకు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. (Story:అధికారులు ప్రజలను తిప్పకుండా పనులు పూర్తి చేయాలి)
