నకిలీ పురుగు మందుల మాఫియా!
పాలకుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపం
రైతుల జీవితాలతో రాజకీయ ఆటలు
శ్రీకాకుళం, నరసన్నపేట నియోజవర్గం, జలుమూరు మండలంలో చల్లపేటలో దందా
న్యూస్‌తెలుగు/శ్రీకాకుళంః ఎరువుల కొరత ఒకపక్క రైతుల భవిష్యత్తును చీకట్లోకి నెడుతుంటే, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజవర్గం జలుమూరు మండలం చల్లపేటలో రైతుల కష్టార్జితాన్ని బలిగొడుతున్న నకిలీ పురుగు మందుల మాఫియా మరో వైపు కత్తిరిస్తోంది. స్థానికంగా కొన్ని షాపు డీలర్లు సిండికేట్ గా తయారై, రైతుల అమాయకత్వాన్ని దోపిడీ చేస్తూ, నకిలీ మందులు అమ్ముతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
రైతులు రుణాలు చేసి కొన్న మందులు పంటలకు రక్షణ ఇవ్వకపోగా, విరుగుడులా మారి పంటలనే నాశనం చేస్తున్నాయి. చెమటోడ్చిన డబ్బు వృథా అయి, అప్పుల బారిన పడుతున్న రైతుల పరిస్థితిని చూసి గ్రామాలు గుండె పగిలేలా ఉన్నాయి.
కానీ ఇదే సమయంలో అధికారులు మాత్రం ఈ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశీలనలు పేరుకు మాత్రమే, లంచాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు రైతుల మధ్య జోరుగా వినిపిస్తున్నాయి. ప్రజల కళ్ల ముందే జరుగుతున్న ఈ దోపిడీపై పాలకులు కూడా మూగవైఖరి అవలంబించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయ రంగు
రైతుల సమస్యలను పరిష్కరించడానికి కంటే వేదికలపై పెద్దల రాజకీయ యుద్ధాలు చేసుకోవడానికే పాలకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పక్షం వాగ్దానాలు చేసి వదిలేస్తే, ప్రతిపక్షం రైతుల ఆవేదనపై సమావేశాలు పెట్టి ఫోటోలు దిగడానికే పరిమితమవుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
రైతు సంఘాల ప్రతిస్పందన
“ఇలా కొనసాగితే చల్లపేటలోనే కాకుండా మొత్తం జిల్లాలో వ్యవసాయం దెబ్బతింటుంది” అని రైతు సంఘాలు ఘాటుగా హెచ్చరిస్తున్నాయి. నకిలీ మందుల మాఫియాను కట్టడి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నామని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. రైతుల రక్తంతో రాజకీయాలు ఆడుతున్న పాలకులను గట్టిగా నిలదీయాలని రైతు సంఘాల డిమాండ్.
రైతు సమస్యలు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తొచ్చే స్థితి వస్తే, భవిష్యత్తులో పల్లెల్లో పంటలు కాక అప్పులు, నిరాశ్రయులే ఎక్కువ మిగిలిపోతారన్న హెచ్చరికను ఈ ఘటన మళ్లీ రుజువు చేస్తోంది. (Story: నకిలీ పురుగు మందుల మాఫియా!)

