Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నేడే వినుకొండ మార్కెట్ యార్డు వేదికగా మెగా కిసాన్ మేళా

నేడే వినుకొండ మార్కెట్ యార్డు వేదికగా మెగా కిసాన్ మేళా

0

నేడే వినుకొండ మార్కెట్ యార్డు వేదికగా మెగా కిసాన్ మేళా

సాగు సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యమన్న జీవీ

న్యూస్ తెలుగు/ వినుకొండ : సాగు రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా వినుకొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్ వేదికగా మంగళవారం మెగా కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ చీఫ్‌ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. వసాయ రంగంలో నూతన పద్ధతులు, యాంత్రీకరణ ప్రాధాన్యం తెలియజెప్పేలా ఈ సరికొత్త వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాగు, రైతుల సమస్యలకు సంబంధించిన వివిధ అంశాల్లో నిపుణులైన శాస్త్రవేత్తల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి పరిష్కారాలు చూపిస్తామన్నారు. సోమవారం ఈ మేరకు వీడియో విడుదల చేసిన చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు ఆధునిక వ్యవసాయం, రైతుల ఆర్థిక ప్రగతి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, వారి తలసరి ఆదాయం పెంచడం, అప్పు తీర్చి ఆనందంగా ఉంచాలన్నదే తన ఆలోచననని తెలిపారు. మెగా కిసాన్ మేళాకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సీనియర్ శాస్త్రవేత్తలు హాజరవుతున్నారని, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, పండ్ల తోటల పెంపకంలో మెళుకువలు, ఆధునిక యంత్రాలు, సాగుపద్ధతులు, కొత్త వంగడాలు, అధిక దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తారన్నారు. సస్య రక్షణ, వ్యవసాయ అనుబంధ రంగాలైన డెయిరీ, ఫౌల్ట్రీ, మత్స్యకారుల, గొర్రెల పెంపకం, నేత, గీత కార్మికులకు ఆయా రంగాల్లో అధిక లాభాలు సాధించడం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రకృతి వ్యవసాయం, పశుసంవర్ధక, పట్టుపరిశ్రమ, బిందుసేద్యం, ఉద్యాన తదితర శాఖలు, వివిధ రకాల ఆధునిక యంత్రాలు, రైతులకు అవసరమైన పరికరాలు, ఎరువులు, బ్యాంక్ సేవలు, డ్రోన్లకు సంబంధించి 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రోన్, ట్రాక్టర్ స్ప్రేయర్లతో మందుల పిచికారీపై అవగాహన కల్పించడమే కాక రైతుల సందేహాలు శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తారని చెప్పారు. వేలాది మంది రైతు సోదరులు తరలివచ్చి మెగా కిసాన్ మేళాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మెగా కిసాన్ మేళా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రైతులకు విజ్ఞానం, అధిక దిగుబడులు సాధించి ఎక్కువ లాభాలు పొందడానికి ఈ మెగా కిసాన్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. (Story:నేడే వినుకొండ మార్కెట్ యార్డు వేదికగా మెగా కిసాన్ మేళా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version