గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి..
గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం కల్పించాలి ..
జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్..
వినుకొండలో గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం..
గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి..
ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే ఊరుకునేదే లేదు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు తీర్మానం
మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. వినుకొండ జాషువా కళామందిర్ లో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి, గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఆదివారం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని జాషువా కళామందిర్ ఆడిటోరియంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్న నేటికీ రాష్ట్రంలోని లక్షలాదిమంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని, ఇప్పటికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పొలాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గిరిజన జాతీ అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయలు నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్టసభలలో గిరిజనుల తరఫున ప్రాతినిత్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు. అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంకటితంగా మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉద్యమించాలన్నారు. ఎస్టిలో ప్రధానంగా సుగాలి, చెంచు, ఎరుకల, యానాది ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయటం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత 58 సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు. ఇకనైనా మేలుకొని మన హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను తీసుకోరాటం చాలా బాధాకరంగా ఉందన్నారు. అభివృద్ధికి నోచక ఇప్పటికీ దిక్కులేని స్థితిలో గిరిజన ప్రజానీకం జీవిస్తున్నారనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలన్నారు.
1962 నుండి 67 వరకు చట్టసభలకు నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాలను ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ అందించడం వలన మైదాన ప్రాంతాల్లో అప్పటి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండేది. మైదాన ప్రాంతాల్లో కదిరి, కావలి, మాచర్ల, జగ్గయ్యపేట నాలుగు అసెంబ్లీ స్థానాలకు రిజర్వేషన్ కల్పించి చట్టసభలో ప్రాతినిథ్యం వహించారు కానీ 1967లో ప్రభుత్వ పాలన విధానాల్లో జరిగిన మార్పుల వలన జిల్లా యూనిట్ తీసుకోకుండా రాష్ట్ర యూనిట్ గా తీసుకోవడం వలన ఏజెన్సీ ప్రాంతాలకి మాత్రమే గిరిజన రిజర్వేషన్ నియోజకవర్గం పరిమితమయ్యాయి. అలా చేయడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 2026 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225 పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాలలో రాష్ట్ర జనాభాలో సగ భాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా, ఆర్థిక, రాజకీయ ఉద్యోగ రంగాలలో ప్రాతినిత్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. జాతి భవిష్యత్తు కోసం, అభ్యున్నతి కోసం, జాతీ వెలుగు కోసం, ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపి ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, బీఎస్పీ పార్టీ కార్యదర్శి రాజు, పల్నాడు జిల్లా యువజన నాయకుడు జరపల కృష్ణా నాయక్, యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగ నాయక్ గౌరవ అధ్యక్షుడు విష్ణు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బాలాజీ నాయక్, డాక్టర్ కోటేశ్వరరావు నాయక్ ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, మాచర్ల జడ్పిటిసి మల్లు సామి, రేమిడిచర్ల సర్పంచ్ బ్రహ్మం, రాంజీ నాయక్, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. (Story : గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి..)

