చంద్రబాబు నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా ఏపీ పోలీసింగ్
ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లో వెల్లడించిన ర్యాంకుల వివరాలే సాక్ష్యమన్న జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ ఆదర్శంగా నిలిచిందని, ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లో వెల్లడించిన వివరాలు, ర్యాంకులే అందుకు సాక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవకముందే, చట్టాల అమలు, శాంతి భద్రతల పునరుద్ధరణలో సాధించిన పురోగతిని ఆ నివేదిక కళ్లకు కట్టిందన్నారు. సత్వర న్యాయం, పటిష్ఠ పోలీసింగ్, ప్రజలకు న్యాయ సహాయం వంటి సూచీలలో అగ్రస్థానాలు సాధించడం, ప్రజలకు కొత్త భరోసా కలిగించిందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు పత్రికాప్రకటన విడుదల చేశారు. విపక్ష వైకాపా, జగన్‌రెడ్డి చేస్తు న్న విమర్శలకు కూడా ఈ నివేదిక అద్దంలాంటి సమాధానమని చురకలు వేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే రాష్ట్రం చట్ట పాలనలో 6.32 స్కోర్ సాధించి దేశంలో రెండో స్థానంలో నిలవడం జగన్ లాంటి అరాచకశక్తులకు అర్థం అవుతుందో లేదో కూడా చురకలు వేశారు. ఇండియా జస్టిస్ నివేదికలో 6.78 పాయింట్లతో కర్ణాటక మాత్రమే ఏపీ కన్నా పై ర్యాంక్ సాధించిందని, తెలంగాణ, కేరళ, తమిళనాడు తదుపరి స్థానాల్లో ఉన్నాయని రిపోర్ట్ తెలిపిందని వివరించారు. జగన్ పాలనలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు రాజ్యమేలాయన్న చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు నేడు ప్రతి పౌరుడు సురక్షిత భావనతో జీవిస్తున్నారని స్పష్టం చేశారు. వారి పాలనలో ఎక్కడ చూసినా గంజాయి, గుట్కా, డ్రగ్స్, అక్రమ మద్యంతో నేరాలు, దారుణాలు చూశామని, ఆడవారి అఘాయిత్యాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ఎద్దేవా చేశారు. పోలీసింగ్‌లో కొత్త టెక్నాలజీ వినియోగం, సీసీ కెమెరా నెట్‌వర్క్ విస్తరణ, డ్రోన్ పర్యవేక్షణ, క్రైమ్ అనాలిటిక్స్ యూనిట్ల ఏర్పాటు వంటి చర్యలు, ఏపీని దేశంలో టాప్ స్థాయికి చేర్చాయని తెలిపారు. నేరాలపై త్వరిత స్పందన, ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్య, పోలీసు–ప్రజా సంబంధాల మెరుగుదల వంటి అంశాలు రిపోర్ట్‌లో ప్రశంసలు అందుకున్నాయన్నారు. ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలవడం, పేదలు, వెనుకబడిన వర్గాలకి న్యాయం అందించడంలో ప్రభుత్వ కట్టుబాటును చూపిస్తున్నదని జీవీ ఆంజనేయులు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఈ రిపోర్ట్ మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు.(Story : చంద్రబాబు నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా ఏపీ పోలీసింగ్ )

